పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మామూలు స్పీడులో లేడు. వరుసబెట్టి షూటింగ్‌లకు హాజరవుతూ.. చకచకా చేతిలో ఉన్న ఒక్కో సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు పవన్. ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం కొన్ని రోజుల పాటు బల్క్ డేట్లు ఇచ్చి షూటింగ్ చివరి దశకు తీసుకొచ్చిన పవన్.. ఆ తర్వాత దాన్నుంచి బ్రేక్ తీసుకుని ఇటీవలే ‘వినోదియ సిత్తం’ రీమేక్‌ను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే.
గ్యాప్ లేకుండా 20 రోజుల పాటు చిత్రీకరణకు హాజరవుతున్న పవన్ ఈ సినిమాను పూర్తి చేశాకే బయటికి రానున్నాడు. ఇంతలో పవన్ మరో కొత్త సినిమా చిత్రీకరణకు కూడా రంగం సిద్ధమవుతోంది. పవన్ రీఎంట్రీ తర్వాత అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన సినిమా అది కావడం విశేషం. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఆ సినిమా మరికొన్ని రోజుల్లో సెట్స్ మీదికి వెళ్లబోతోంది.
ఏప్రిల్ తొలి పది రోజుల్లోనే పవన్-హరీష్ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుపెట్టనున్నారు. తొలి షెడ్యూల్ కోసం పది రోజుల డేట్లు కేటాయించాడట పవన్. ఒక భారీ సెట్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరగనుంది. పవన్‌కు అత్యంత సన్నిహితుడైన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆధ్వర్యంలో ఈ సెట్ నిర్మాణం జరుగుతోంది.
ఈ పనులను పర్యవేక్షిస్తూనే.. కాస్టింగ్ సంగతి చూస్తున్నాడు హరీష్ శంకర్. ఈ చిత్రానికి ఒక కథానాయికగా శ్రీ లీల ఖరారైంది. ఆమెతో పాటు మరో హీరోయిన్‌కు కూడా కథలో చోటుంది. ఆ పాత్రకు మలయాళీ భామ మాళవిక మోహనన్ ఖరారైనట్లు తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం కావాల్సిన మాళవిక.. ఆ సినిమా రద్దయ్యాక చాలా గ్యాప్ తీసుకుని ప్రభాస్-మారుతి సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఈలోపే పవన్ లాంటి పెద్ద హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది. హరీష్ సినిమా ఒక షెడ్యూల్ అయ్యాక.. సుజీత్ చిత్రాన్ని కూడా మొదలుపెట్టాలని పవన్ చూస్తున్నట్లు సమాచారం.