ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలిసి వెళ్తారనే విషయంలో అమితాసక్తి రేగుతోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎప్పట్లాగే ఒంటరిగా పోటీ చేయబోతోంది. కాకపోతే జగన్‌కు కేంద్ర భాజపా పెద్దలతో లోపాయకారీ ఒప్పందం ఉందని, వారి మోరల్ సపోర్ట్ ఆయనకే అని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.
గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి దెబ్బ తిన్న తెలుగుదేశం, జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం పక్కా అని గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. ఈ రెండు పార్టీలకు బీజేపీ కూడా తోడైతే నైతిక బలం పెరుగుతుందని.. వైకాపాను ఢీకొట్టడం తేలికవుతుందని భావిస్తున్నారు. బీజేపీకి ఓటు బలం లేకపోయినా కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉండడం కలిసొస్తుందని అనుకుంటున్నారు. కానీ అలా జరిగే సూచనలు కనిపించడం లేదు.
ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీని పవన్ కళ్యాణ్ విశాఖలో కలవడం తెలిసిందే. ఆ సందర్భంగా వారి మధ్య ఏం చర్చ జరిగిందనే విషయంలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఐతే ఈ విషయమై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలుగుదేశంతో కలిసి సాగుదామంటూ పవన్ ప్రపోజల్ పెట్టగా.. మోడీ తిరస్కరించారని వీర్రాజు స్పష్టం చేశారు. బీజేపీ కుటుంబ రాజకీయాలకు దూరం అని, కాబట్టి తెలుగుదేశంతో కలిసేది లేదని మోడీ స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు.
జనసేనకు తెలుగుదేశంతో పొత్తు ఉండదని.. పవన్‌తో తమతోనే కలిసి సాగుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆ సమావేశంలో మోడీ, పవన్, నాదెండ్ల మనోహర్ మాత్రమే ఉన్నారు. మోడీ వీరితో ఏం మాట్లాడారన్నది అసలు బయటికి వచ్చి ఉంటుందా అన్న డౌట్లు ఉన్నాయి. కాకపోతే ఎంతైనా వీర్రాజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఈ మాటలను కొట్టి పారేయలేం మొత్తానికి బీజేపీ అయితే తెలుగుదేశంతో కలిసేది లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. మరి పవన్.. బీజేపీతోనే సాగుతాడా, లేక తెలుగుదేశంతో జట్టు కడతాడా అన్నదే చూడాలిక.