మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ గతంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సభ నిర్వహించుకునేందుకు ఇప్పటం గ్రామస్తులు తమ పొలాలను ఇచ్చారన్న కృతజ్ఞతతో ఆ గ్రామానికి 50 లక్షల ఆర్థిక సహాయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రకటించారు. అయితే, తాజాగా ఆ గ్రామంలో రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చివేశారు అంటూ వివాదం రేగిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఆ గ్రామానికి చెందిన వ్యక్తి ఒకరు పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఆనాడు తమ గ్రామానికి 50 లక్షల రూపాయలు ఇస్తానని పవన్ చెప్పారని, కానీ ఇప్పటివరకు ఆ డబ్బు తమ గ్రామపంచాయతీకి పవన్ ఇవ్వలేదని ఆ గ్రామస్తుడు ఒకరు షాకింగ్ ఆరోపణలు చేశారు. పవన్ కు దమ్ము, ధైర్యం ఉంటే ఇప్పటం గ్రామంలో అడుగుపెట్టినప్పుడు ఆ 50 లక్షల రూపాయల క్యాష్ ను తీసుకువచ్చి గ్రామపంచాయతీకి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
తమ గ్రామంలో అన్ని కులాల వారు, మతాలవారు అన్నదమ్ముల మాదిరిగా కలిసిమెలిసి ఉంటారని, తమ మధ్య ఎటువంటి రాజకీయ వివాదాలు లేవని ఆయన చెప్పారు. అయితే, దూకుడు సినిమాలో బ్రహ్మానందం మాదిరిగా నలుగురు కమెడియన్లు వచ్చి తమ గ్రామంలో నానా రచ్చ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్టీలకు అతీతంగా గ్రామస్తులంతా కలిసిమెలిసి పెళ్లిళ్లు, పండగలు జరుపుకుంటామని, అటువంటి గ్రామంలో రాజకీయ వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు కొందరు కొత్తగా వచ్చారని ఆరోపించారు. మరి ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్, జనసేన నేతల స్పందన ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.