తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్తపార్టీ ఆవిర్భావం నేడు జరగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురాడమే లక్ష్యంగా తాను వైఎస్సార్ టీపీ పార్టీ పెడుతున్నట్టు షర్మిల గతంలో వెల్లడించారు. అయితే, వైఎస్ షర్మిల పార్టీ తెలంగాణలో రాణించదని, ఆమె ఆంధ్రా నాయకురాలంటూ తెలంగాణలోని రాజకీయ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్, కేసీఆర్ ల కనుసన్నల్లోనే షర్మిల పార్టీ పెడుతున్నారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల కొత్తపార్టీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.
తెలంగాణలో షర్మిల పార్టీకి స్వాగతం చెప్పిన పవన్ కల్యాణ్…ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావాలని అభిప్రాయపడ్డారు. అయితే,తెెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు తన దగ్గర డబ్బు, బలం లేదని పవన్ అన్నారు. పగటి కలలు కనే వ్యక్తిని తాను కాదన్నారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అయిన విషయాన్ని కూడా విన్నానని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి చేయడానికి ఎవరొచ్చినా స్వాగతించాలని, 2007 నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని అన్నారు.
తెలంగాణ ఉద్యమాల పురిటిగడ్డ అని, కొత్త రక్తం, చైతన్యవంతమైన యువత రాజకీయాల్లోకి రావాలని పవన్ పిలుపునిచ్చారు. జనసేన తరఫున అటువంటి వారిని గుర్తించి మద్దతిచ్చామని పవన్ అన్నారు. పార్టీ నిర్మాణం చాలా కష్టమని, తాను పగటికలలు కనే వ్యక్తిని కాదని పవన్ తెలిపారు. రాజకీయాలకు వారసత్వంతో సంబంధం లేదని, పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేని వారు కూడా రాజకీయాల్లోకి రావాలని పవన్ ఆకాంక్షించారు.