ప‌వ‌న్.. ఇదే నీ అభిమానులు కోరింది

ఈ రోజుల్లో సున్నితంగా, సంస్కార‌వంతంగా, ప్ర‌త్య‌ర్థుల్ని గౌర‌వంగా సంబోధిస్తూ రాజ‌కీయాలు చేస్తే న‌డ‌వ‌దు. కొత్త త‌ర‌హా రాజ‌కీయం అంటూ తెర‌పైకి వ‌చ్చిన అర‌వింద్ కేజ్రీవాల్ సైతం ప్ర‌త్య‌ర్థుల్ని దీటుగా, ధాటిగానే ఎదుర్కొన్నారు. త‌మ విధానాల్ని బ‌లంగా జ‌నాల్లోకి తీసుకెళ్తూనే ప్ర‌త్య‌ర్థుల‌పై ప‌దునైన విమ‌ర్శ‌లు చేసి వార్త‌ల్లో నిలిచారు.

వేరే పార్టీల వాళ్ల‌ను బూతులు తిట్టి దిగ‌జారి మాట్లాడాల్సిన అవ‌స‌రం లేదు కానీ.. జ‌నాల్లో ఒక చ‌ర్చ జ‌ర‌గాల‌న్నా.. మీడియాలో హైలైట్ కావాలన్నా.. అలాగే పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో ఊపు రావాల‌న్నా అగ్రెసివ్‌గా మాట్లాడాల్సిందే. పంచ్‌లు ప‌డాల్సిందే. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు సోమ‌వారం ఈ విష‌యం బాగా అర్థ‌మ‌య్యే ఉంటుంది. ఆయ‌న సినిమాల స్ట‌యిల్లో పంచ్ డైలాగులు పేలుస్తూ త‌న ప‌ర్య‌ట‌న‌లో వైకాపా మంత్రులు కొడాలి నాని, పేర్ని నానీ త‌దిత‌రుల‌నుద్దేశించి పేల్చిన పంచులు హాట్ టాపిక్ అయ్యాయి.

ముఖ్యంగా ‘శ‌త‌కోటి లింగాల్లో ఒక బోడి లింగం.. ఎంతోమంది నానీల్లో ఒక నాని’ అంటూ ప‌వన్ విసిరిన పంచ్ మామూలుగా పేల్లేదు. అలాగే వ‌ర‌ద బాధితులైన రైతుల‌కు సాయం విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కారుకు అల్టిమేటం ఇవ్వ‌డం, అసెంబ్లీ ముట్ట‌డిస్తామ‌న‌డం కూడా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

మామూలుగా ప‌వ‌న్ స‌భ‌ల్ని, ప‌ర్య‌ట‌న‌ల్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్ద‌గా ప‌ట్టించుకోదు. ఆయ‌న ప్ర‌సంగాల‌కు మీడియాలో ద‌క్కే ప్రాధాన్యం త‌క్కువ. కానీ తాజా ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ అగ్రెసివ్ స్పీచ్ వ‌ల్ల‌, పంచ్ డైలాగుల వ‌ల్ల మీడియా క‌వ‌రేజీ అనివార్య‌మైంది. సోష‌ల్ మీడియాలో అయితే రచ్చ మామూలుగా లేదు. దీనికి వైసీపీ నుంచి ఎదురుదాడి గట్టిగానే ఉన్నా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే జనసైనికులు వారికి దీటుగా బదులిస్తున్నారు.

ఏపీ రాజకీయాలకు సంబంధించి సోమవారం మధ్యాహ్నం నుంచి ఇదే హాట్ టాపిక్ అయింది. పవన్ టార్గెట్ చేసిన మంత్రులిద్దరూ.. ముఖ్యంగా కొడాలి నాని రివర్స్ పంచ్ ఇవ్వకుండా ఆగరు. ఐతే పవన్ మాట్లాడింది రైతులకు సంబంధించిన విషయం కావడం ఇక్కడ సమస్య. పవన్ లేవనెత్తిన పరిహారం గురించి మాట్లాడకుండా కేవలం జనసేనానిని టార్గెట్ చేసినా జనాలకు వేరే సంకేతాలు వెళ్తాయి. మొత్తానికి పవన్ టైమింగ్ చూసి కొట్టాడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయన పంచ్‌లతో జనసైనికుల్లో మంచి ఉత్సాహం వచ్చింది. ఇకముందూ జనసేనాని ఇంతే దూకుడుగా ఉండాలని వారు కోరుకుంటున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.