మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి ఏపీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఓ పక్క వైసీపీ..మరో పక్క ఎన్డీఏ కూటమి గెలుపు కోసం హోరాహోరీగా తలపడ్డాయి. ఏపీలో అధికారం ఎవరిది అన్న ఉత్కంఠత ఓ వైపు ఉంటే…జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో గెలుస్తారా? గెలిస్తే ఎంత మెజారిటీ? అన్న అంశంపై కూడా తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఏపీలో కూటమి గెలుపు ఖాయమని మెజారిటీ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో అంచనావేశాయి. కానీ, ఆరా (AARAA) సంస్థ అధినేత షేక్ మస్తాన్ మాత్రం ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశారు. అయితే, గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయిన జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని మస్తాన్ వెల్లడించారు.
పవన్ తోపాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని ఆయన అంచనా వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అన్నారు. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ మంచి మెజారిటీతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆయన అంచనా వేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 94 నుంచి 104 స్థానాలు వస్తాయని, ఎన్డీఏ కూటమికి 71 నుంచి 81 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. ఏపీలోని 25 లోక్ సభ స్థానాలలో వైసీపీకి 13 నుంచి 15 స్థానాలు, ఎన్డీఏ కూటమికి 10 నుంచి 12 స్థానాలు వస్తాయని మస్తాన్ అంచనా వేశారు.