టీడీపీ అధికార ప్రతినిధిగా ‘పట్టాభి’ కొంతకాలంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ వైసీపీ వైఫల్యాలను, సీఎం జగన్ పాలనలోని లోపాలను ఎత్తిచూపడంలోనూ పట్టాభి ముందు వరుసలో ఉంటున్నారు. జగన్ తో పాటు వైసీపీ నేతలపై పదునైన విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది నెలల క్రితం పట్టాభి ఇంటిపై, టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడిన ఘటన సంచలనం రేపింది.
ఆ తర్వాత తాజాగా వల్లభనేని వంశీ వ్యవహారం నేపథ్యంలో పట్టాభిని పోలీసులు అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతోపాటు హత్యాయత్నం కేసును నమోదు చేశారు. అయితే, పట్టాభిని వైసీపీ నేతలు ఇంతలా టార్గెట్ చేయడానికి బలమైన కారణాలున్నాయని ప్రచారం జరుగుతోంది. గన్నవరంలో వల్లభనేని వంశీని ఎదుర్కొనే బలమైన నేత కోసం ఎదురుచూస్తున్న సమయంలో పట్టాభిపై టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి మళ్లిందని టాక్ వస్తుంది.
పట్టాభి కూడా వంశీ సామాజిక వర్గానికి చెందినవారే కావడం, ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో సక్సెస్ కావడం వంటి కారణాలతో పట్టాభికి రాబోయే ఎన్నికల్లో గన్నవరం టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. గత మూడేళ్లుగా పార్టీలో పట్టాభి యాక్టివ్ గా ఉంటూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే విమర్శలు చేస్తుండడంతో టిడిపి శ్రేణుల నుంచి కూడా పట్టాభికి మద్దతు ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పట్టాభి ఇంటికి చంద్రబాబు నాయుడు రెండుసార్లు వెళ్లి అండగా ఉంటామని భరోసానిచ్చారని తెలుస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో గన్నవరంలో పాలిటిక్స్ గరంగరంగా ఉంటాయని, వల్లభనేని వంశీ వర్సెస్ పట్టాభి వార్ జరగబోతుందని ప్రచారం జరుగుతోంది. వల్లభనేని వంశీకి చెక్ పెట్టేందుకే ‘పట్టాభి’షేకం అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
మరోవైపు, తాజాగా పట్టాభిని వైద్య పరీక్షల తర్వాత మరోసారి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సీల్డ్ కవర్లో వైద్యులు ఇచ్చిన నివేదికను న్యాయమూర్తికి పోలీసులు అందజేశారు. నివేదికను పరిశీలించిన అనంతరం పట్టాభిని గన్నవరం సబ్ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, శాంతిభద్రతల కారణాల రీత్యా పట్టాభిని వేరే సబ్ జైలుకు తరలించాలని పోలీసులు చేసిన విజ్ఞప్తిని జడ్జి తోసిపుచ్చారు ముందస్తు అనుమతి కోరితే పరిశీలిస్తామని వెల్లడించారు.