అనంతపురంలో పరిటాల కుటుంబానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దివంగత నేత పరిటాల రవి, ఆయన సతీమణి, మాజీ మంత్రి పరిటాల సునీతల పేర్లు తెలియని వారుండరు. మూడు దశాబ్దాలుగా అనంత రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ చేసుకుంటున్న పరిటాల కుటుంబానికి అక్కడి ప్రజలు నీరాజనాలు పడుతుంటారు. అయితే, ఇంతటి హై ప్రొఫైల్ ఉన్న పరిటాల సునీతకు చెందిన భూమిని రెవెన్యూ అధికారులు మాయం చేసిన వైనం అనంతలో హాట్ టాపిక్ గా మారింది.
పరిటాల సునీత భూమి రికార్డులను రెవెన్యూ అధికారులు మార్చివేయడం కలకలం రేపింది. కనగానపల్లి మండలం నర్సంపల్లి గ్రామంలో పరిటాల సునీత పేరుతో ఉన్న 26 ఎకరాల భూమికి రెవెన్యూ అధికారులు రెడ్ మార్క్ వేయడం చర్చనీయాంశమైంది. అయితే, ఆన్లైన్లో తన పేరున ఉండాల్సిన భూమి కనిపించకపోవడంతో సునీత ఆరా తీశారు. రెవెన్యూ అధికారులు రెడ్ మార్క్ వేసినట్టు తెలియడంతో ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
వారి ఆదేశాలతో కనగానపల్లి రెవెన్యూ అధికారులు ఆన్ లైన్లో సునీత రికార్డును సరి చేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సునీత మండిపడ్డారు. మాజీ మంత్రి అయిన తన పట్టా భూమిని రెవెన్యూ అధికారులు వేరొకరి పేరుతో మార్చారని, తన పరిస్థితే ఇలా ఉంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని పరిటాల సునీత ఆవేదన వ్యక్తం చేశారు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని పరిటాల సునీత మండిపడ్డారు. అలాంటివారు పనితీరు మార్చుకోవాలని సునీత వార్నింగ్ ఇచ్చారు. రైతులకు అధికారులు అన్యాయం చేయవద్దని, వివరాలన్నీ సక్రమంగా ఉండి సాగుచేసుకుంటున్నవారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.