‘పలాస’ సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే చాలా మంచి పేరు సంపాదించాడు కరుణ్ కుమార్. సుధీర్ బాబు హీరోగా ఆయన తీసిన రెండో సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’ ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు పెంచింది.
ఎన్నో పరిమితుల మధ్య ‘పలాస’ సినిమాను చాలా బాగా తీసిన కరుణ్.. ఈసారి కాస్త ఇమేజ్ ఉన్న హీరో, పేరున్న నిర్మాణ సంస్థలో సినిమా కావడంతో ఇంకా మెరుగైన సినిమానే తీసి ఉంటాడని ప్రేక్షకులు ఆశలు పెట్టుకున్నారు. కానీ సినిమా చూస్తే నిట్టూర్పులే మిగిలాయి.
ఈ సినిమా ప్రి రిలీజ్ ప్రమోషన్లలో కరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ఎప్పుడు తమిళంలో, మలయాళంలో గొప్ప సినిమాలు వచ్చాయని పొగుడుతున్నాం తప్ప మనం అలాంటి సినిమాలు తీయడం లేదనే విమర్శలున్నాయని.. ‘శ్రీదేవి సోడా సెంటర్’ అలాంటి గొప్ప సినిమానే అవుతుందని వ్యాఖ్యానించాడు. కానీ ఆయన చెప్పిన స్థాయిలో సినిమా ఎంతమాత్రం లేదు.
‘శ్రీదేవి సోడా సెంటర్’ చూసిన వాళ్లందరూ క్లైమాక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. అది చాలా కొత్తగా, హార్డ్ హిట్టింగ్‌గా ఉందని అంటుున్నారు. కానీ ఇందులో కరుణ్ కుమార్ కొత్తగా చేసిందేమీ లేదు.
తమిళంలో రెండేళ్ల కిందట వచ్చిన ‘పరియేరుం పెరుమాళ్’ సినిమా స్ఫూర్తితో అల్లుకున్న ఎపిసోడే అది. అది కులాంతర ప్రేమలు, పెళ్ళిళ్ళ చుట్టూ నడిచే హార్డ్ హిట్టింగ్ మూవీ. చాలా ఎమోషనల్‌గా, హృద్యంగా సాగుతుందీ చిత్రం.
తక్కువ కులానికి చెందిన అబ్బాయిల్ని అగ్ర వర్ణాల అమ్మాయిలు ప్రేమిస్తే వారి పట్ల కర్కోటకంగా వ్యవహరించే సన్నివేశాలుంటాయందులో. అందులో ఒక సన్నివేశం స్ఫూర్తితోనే ‘శ్రీదేవి సోడా సెంటర్’ క్లైమాక్స్ తీర్చిదిద్దినట్లు స్పష్టంగా తెలిసిపోతుంది.
పైగా ఆ చిత్రంలో కథానాయికగా నటించిన ఆనందినే ‘శ్రీదేవి సోడా సెంటర్’లో హీరోయిన్గా చేయడంతో పోలికలు మరింతగా కనిపిస్తాయి. కేవలం ఆ క్లైమాక్స్‌ను నమ్ముకుని కరుణ్ మిగతా సినిమానంతా మామూలుగా నడిపించేశాడు. ప్రశంసలు అందుకుంటున్న పతాక ఘట్టం కూడా ఒరిజినల్ కాదు.
‘పలాస’తో తనపై ఎంతగానో అంచనాలు పెంచిన దర్శకుడు రెండో సినిమాతో ఇలా తన స్థాయిని తగ్గించేసుకోవడం చాలామందికి రుచించట్లేదు. తర్వాతి సినిమాతో అయినా మళ్లీ కరుణ్ తన తొలి సినిమా స్థాయిని అందుకుంటాడేమో చూడాలి.