జైలు నుంచి ఖైదీలు పారిపోవడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. తాజాగా ఇద్దరు ముగ్గురు కాదు ఏకంగా 200 మంది ఖైదీలు జైలు నుంచి జంప్ అయ్యారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయితే ఈ ఘటన ఇండియాలో కాదు పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరాచీ దక్షిణ ఓడరేవు నగరంలోని మాలిర్ జిల్లా జైలులో సోమవారం అర్ధరాత్రి భారీ భద్రతా ఉల్లంఘన జరిగింది.
మే 30వ తేదీన పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. మాలిర్ జైలు పరిసర ప్రాంతాల్లో కూడా భూకంపం రావడంలో అధికారులు దాదాపు 2,000 మంది ఖైదీలను వారి బ్యారక్‌ల నుండి బయటకు తీసుకొచ్చారు. ఆ గందరగోళ పరిస్థితుల్లో చాలా మంది కరుడగట్టిన నేరస్థులు ఇదే అదునుగా భావించి మెయిన్ గేట్ బలవంతంగా తీసుకొని పారిపోవడానికి యత్నించారు.
ఫ్రాంటియర్ కాన్స్టాబులరీ సిబ్బంది భారీ వైమానిక కాల్పులు జరిపినప్పటికీ.. వారు వెనక్కి తగ్గలేదు. ఖైదీలు గార్డులతో ఘర్షణ పడటం, ఆయుధాలను లాక్కోవడం మరియు కాల్పులు జరపడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. ఈ పరిణామల నడుమ 216 మంది ఖైదీలు పారిపోగా.. కాల్పుల్లో ఒక ఖైదీ మరణించాడు. మరో ఐదుగురు గాయపడ్డారు. అదనంగా ముగ్గురు ఫ్రాంటియర్ కాన్స్టాబులరీ సిబ్బంది గాయపడి ఆసుపత్రి పాలయ్యారు.
ప్రస్తుతం ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కాగా, సోమవారం రాత్రి తప్పించుకున్న ఖైదీల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. ఇప్పటివరకు 78 మంది ఖైదీలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 138 మంది ఖైదీల కోసం వేట కొనసాగుతోంది. కరుడగట్టిన నేరస్థులు తప్పించుకోవడంతో కరాచీ మొత్తం హై అలర్ట్ నడుస్తోంది. జైలు పరిసర ప్రాంతాల్లో సాధారణ ప్రజలు ఎవరూ సంచరించవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.