గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్న తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే విజయసాయిరెడ్డి వంటి ముఖ్య నాయకుల నుంచి చోటా మోటా నేతల వరకు చాలా మంది ఫ్యాన్ పార్టీని వీడారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం కూటమి పార్టీల్లోకి జంప్ అయ్యారు. తాజాగా కంచుకోటలోనే వైఎస్ జగన్ కు బిగ్ షాక్ తగిలింది. కడప తర్వాత వైసీపీకి అంతటి కంచుకోటగా ఉన్నది నెల్లూరు జిల్లానే.
అయితే 2024 ఎన్నికల్లో కూటమి జోరుకు నెల్లూరు జిల్లాలోనూ వైసీపీ ప్రతికూల ఫలితాలనే ఎదుర్కొంది. తాజాగా నెల్లూరు జిల్లా కొవ్వూరులో ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 1500 మందికి పైగా వైసీపీకి గుడ్ బై చెప్పారు. మానేగుంట, రామన్నపాలెం, రెడ్డిపాలెం, అమ్మపాలెం పంచాయతీల్లోని అన్ని గ్రామాల్లోనూ వైసీపీ నేతలు, శ్రేణులు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీరును వ్యతిరేకిస్తున్నారు.
ఈ వ్యతిరేకత ఇప్పుడు పార్టీ మార్పు వరకు వెళ్లింది. మొత్తం 1500 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీకి వీడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. వీరిందరికీ ఎంపీ వేమిరెడ్డి దంపతులు, నాపా వెంకటేశ్వర్లు నాయుడు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు. ఏమైనా కంచుకోట లాంటి నెల్లూరు జిల్లాలో ఒకేసారి అంతమంది పార్టీని వీడటం అంటే వైసీపీ ఓటు బ్యాంక్‌కు భారీ చిల్లు పడినట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.