ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయింది. 2024 జూన్ 4 ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు. వైనాట్ 175 అంటూ అధికారంపై గట్టి ధీమాతో ఉన్న వైసీపీ కి కలలో కూడా ఊహించని దెబ్బ తగిలిన రోజు. 164 అసెంబ్లీ సీట్లు, 21 పార్లమెంట్ సీట్లు గెలుచుకుని కనీ వినీ ఎరుగని రీతిలో కూటమి అధికారంలోకి వచ్చిన రోజు. ఫ్యాన్ పార్టీకి రెక్కలు ఊడిపడిన రోజు. పసుపు సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు. ఈ స్పెషల్ డేను కూటమి పార్టీలు ముఖ్యంగా టీడీపీ సంబరంగా జరుపుకుంటుండగా.. వైసీపీ మాత్రం బుసలు కొడుతోంది.
జూన్ 4.. ప్రజా తీర్పు దినం అంటూ టీడీపీ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తోంది. `యువత దగ్గర నుంచి మహిళల వరకు.. రైతుల దగ్గర నుంచి కుల వృత్తి దారుల వరకు.. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల దగ్గర నుంచి 5 కోట్ల ప్రజల వరకూ.. విధ్వంసకారుడు వద్దు, విజనరీ లీడర్ నేతృత్వంలో కూటమి పరిపాలన కావాలంటూ, జగన్ అనే వెన్నుపోటు దారుడిపై జనం చేసిన తిరుగుబాటే ఈ ప్రజా తీర్పు దినం` అంటూ టీడీపీ ట్వీట్ చేసింది.
మరోవైపు వైసీపీ జూన్ 4ను విన్నుపోటు దినంగా పరిగణిస్తూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతోంది. సూపర్-6 చంద్రబాబు, పవన్ కు బంగారు బాతులా మారిపోయింది.. మీ ద్రోహాన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోరంటూ ఫ్యాన్ పార్టీ విమర్శిస్తోంది. `జగన్ గారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చారు. కానీ సూపర్ -6 హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏడాది అవుతున్న ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. మాట తప్పి చంద్రబాబు చేస్తున్న మోసాన్ని నిరసిస్తూ ఈరోజు వెన్నుపోటు దినంతో బుద్ధి చెబుదాం` అని వైసీపీ పిలుపునిచ్చింది.