ఏపీలో ఇద్దరు ఉన్నతాధికారులకు హైకోర్టు షాకిచ్చింది. ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవి చౌదరికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇచ్చిన ఆదేశాలను ఇంతవరకు అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్య్తక్తం చేస్తూ వారికి జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
ఆ 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను అమలుచేయాలంటూ హైకోర్టు పలుమార్లు ఆదేశించింది. అయినప్పటికీ, ఆ ఆదేశాలను ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవి చౌదరి బేఖాతరు చేశారు. ఈ క్రమంలోనే వారిద్దరూ నేడు కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. విచారణ సందర్భంగా ఆ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తామిచ్చిన ఉత్తర్వులను పెడచెవిన పెట్టినందుకుగాను ఇద్దరికీ చెరో వారం రోజులు జైలు శిక్ష విధించింది ఏపీ హైకోర్టు.
కాగా, ఏపీలో కొద్ది నెలల క్రితం ముగిసిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగానూ ఐఏఎస్ అధికారి, నాటి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ పై బదిలీ వేటు పడడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. నాటి రాష్ట్ర పంచాయతీశాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ లతో భేటీ అయ్యేందుకు మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ప్రయత్నించగా వారు హాజరు కాలేదు.
దీంతో, గోపాల కృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్లను బదిలీ చేయాలని నిమ్మగడ్డ ఆదేశించారు. దీంతో, వారి స్థానంలో మరో ఇద్దరిని నియమించారు. ఆ తర్వాత గిరిజా శంకర్, ద్వివేదీలపై ప్రొసీడింగ్స్ జారీ చేయడం, సర్వీసు రిజిస్టర్ లో రిమార్క్ రాయడం, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు సిఫారసు చేయడం రాష్ట్రంలో పెను కలకలం సృష్టించింది. ఆ తర్వాత తాజాగా మరోసారి గిరిజా శంకర్ పేరు వార్తల్లోకి వచ్చింది.