ఏపీ లో పెను సంచలనం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరియు అతని పీఏ పైలా దిలీప్‌ను అరెస్ట్ చేసి విచారణ జరిపారు. రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టారు. అయితే ఈ కేసులో అరెస్టుల వర్వం కొనసాగుతోంది. తాజాగా మరో కీలక నిందుతుడు గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ 31గా ధనుంజయ రెడ్డి, ఏ 32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ 33 గోవిందప్ప బాలాజీలను చేర్చిన సిట్ అధికారులు.. ఇటీవల విచారణకు హాజరు కావాలంటూ ముగ్గురికీ నోటీసులు జారీ చేశారు. కానీ వారు ముగ్గురు గైర్హాజరు అయ్యారు. అయితే తాజాగా మైసూరులో ఉన్న బాలాజీని పక్కా సమాచారంతో అధికారులు అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ వారెంట్ తో మైసూరు నుంచి బాలాజీని విజయవాడకు తరలిస్తున్నారు.
భారతి సిమెంట్స్ కంపెనీలో గోవిందప్ప బాలాజీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి ముగ్గురూ జగన్ కు అత్యంత సన్నిహితులు. వైసీపీ హయాంలో మద్యం సరఫారా కంపెనీలు, డిస్టిలరీలు నుంచి డబ్బులు వసూలు చేయడం, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మల్లించడంలో ఈ ముగ్గురు ముఖ్య పాత్రను పోషించినట్లు విచారణలో నిందితులు పేర్కొన్నారు. కసిరెడ్టి రాజశేఖర్ రెడ్డి, చాణక్య రిమాండ్ రిపోర్ట్‌లో కూడా ఈ ముగ్గురు పేర్లను ప్రస్తావించారు. ఇక తాజాగా బాలాజీలను సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య ఐదుకు చేరింది.