వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఇరు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు పరిచయం అక్కర్లేదు. తన వివాదాస్పద వ్యాఖ్యలు, కామెంట్లతో నిత్యం వార్తల్లో నిలవడం ఆర్జీవి ప్రత్యేకత. కాంట్రవర్సీనే కంటెంట్ గా పెట్టి సినిమాలు రూపొందించడం వర్మ నైజం. ఈ క్రమంలోనే గతంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆయన తనయుడు లోకేష్ పై బురదజల్లేందుకు సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ వివాదాస్పద చిత్రాన్ని వర్మ తెరకెక్కించారు.
కట్ చేస్తే మళ్ళీ 2024 ఎన్నికలకు మూడు నెలల ముందు వ్యూహం, శపథం అంటూ జగన్ జీవితంలో జరిగిన నిజాలు కొన్ని వెల్లడిస్తానంటూ సినిమా తీశారు వర్మ. అయితే, ఈ సినిమా విడుదలను ఆపాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యవహారం పై విచారణ జరుగుతున్న నేపథ్యంలోని ఈ నెల 29న చిత్రాన్ని విడుదల చేస్తానని వర్మ ప్రకటించారు. ఈ సినిమా విడుదలను కోర్టు తాత్కాలికంగా నిలిపి వేసినప్పటికీ వర్మ రిలీజ్ పై ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వర్మపై అమరావతి రైతుల ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్లు చేశారు.
వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ నజరానా ప్రకటించారు శ్రీనివాసరావు. ఈ క్రమంలోనే ఆ వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ శ్రీనివాసరావుపై వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ట్వీట్ ను తన కంప్లైంట్ లా స్వీకరించి తనను హత్య చేసేందుకు కుట్ర చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వర్మ కోరారు. మరి వర్మ ఫిర్యాదుపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారని ఆసక్తికరంగా మారింది.