దర్శకుడిగా అరంగేట్రంలో హృదయ కాలేయం అనే సెటైరికల్ కామెడీ మూవీతో అందరి దృష్టినీ ఆకర్షించిన సాయిరాజేష్.. ఆ తర్వాత నిర్మాతగానే సినిమాలు చేస్తూ వచ్చాడు. చివరగా అతను తన స్క్రిప్టుతో ప్రొడ్యూస్ చేసిన కలర్ ఫొటో ఆహాలో సూపర్ హిట్టయింది. జాతీయ అవార్డు కూడా అందుకుంది. అందులో పాటలు ఒక పెద్ద సినిమా రేంజిలో విజయవంతం అయ్యాయి. ఇప్పుడు సాయిరాజేష్ మళ్లీ మెగా ఫోన్ పడుతూ బేబి అనే సినిమా తీస్తున్నాడు. ఈ మధ్యే రిలీజైన దీని టీజర్ సినిమా మీద అంచనాలను పెంచింది. ఆ టీజర్లో బీజీఎం చాలామందికి ఒక ఎడిక్షన్ అయిపోయింది. ఆ బీజీఎం సినిమాలోని ఒక పాట నుంచి తీసుకున్నది.
ఆ పాటనే సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌గా రిలీజ్ చేశారు. అది ఇన్‌స్టంట్‌గా హిట్టయిపోయింది. ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. అంటూ సాగే ఈ పాటలో చిన్న పిల్లలతో పాడించిన కోరసే హైలైట్. మనం సినిమాలోని కనిపెంచినా.. హలో మూవీలోని అనగనగా ఒక ఊరు పాటలను గుర్తుకు తెచ్చేలా పిల్లల కోరస్‌ను ఇందులో భలేగా వాడుకున్నాడు సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్. ఇంతకుముందేవో చిన్న స్థాయి మాస్ సినిమాలకు మ్చూజిక్ ఇచ్చిన విజయ్.. ఈ సినిమాతో తన టాలెంట్ ఏంటో రుజువుచేశాడు.
ఇక తీన్మార్లో గెలుపు తలుపులే లాంటి కల్ట్ సాంగ్ పాడిన శ్రీరామచంద్ర.. మళ్లీ ఇన్నాళ్లకు తన ప్రతిభకు న్యాయం చేస్తూ చాలా హృద్యంగా, శ్రావ్యంగా ఈ పాటను ఆలపించాడు. మంగళవారం సాయంత్రం ఈ పాట ఇలా రిలీజైందో లేదో.. కాసేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిపోయింది. ఈ పాట సినిమాకు మంచి హైపే తెచ్చేఆ ఉంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో పాటు వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.