ప్రతిపక్షం వైసీపీ మరో సారి చిత్రమైన ఇరకాటంలో చిక్కుకుంది. ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే.. ఈ సమావేశాలు.. 11 సంఖ్య చుట్టూ తిరుగుతుండడంతో వైసీపీ నాయకులు తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. 11వ నెలలో 11వ తారీకు నుంచి ప్రారంభమయ్యే సమావేశాలు.. 11 రోజుల పాటు జరగనున్నాయి. అయితే.. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న తమ పార్టీని యాగీ చేసేందుకు ఇలా నిర్ణయించారన్న వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ.
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే దక్కారు. దీంతో అప్పటి నుంచి జగన్ ను, వైసీపీని కూడా.. 11 అంకెతో సోషల్ మీడియాలో ఓ ఆట ఆడేస్తున్నారు. ఈ పరిణామాలతో వైసీపీ బిక్కచచ్చిపోతోంది. ప్రజల నుంచి ఎదురైన పరాభవంతో నే ఇబ్బందిగా ఉన్న పార్టీకి ఇప్పుడు మరోసారి 11 చుట్టూ తిరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు మరోసారి ఇబ్బంది పెడుతున్నాయనే చెప్పాలి. దీంతో నాయకులు మరోసారి చర్చల్లో మునిగిపోయారు.
ఇప్పటికే రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తొలిసారి సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. రెండోసారి బడ్జెట్ సమావేశాలు అని పేరు పెట్టినా.. శ్వేత పత్రాల విడుదలకే దానిని పరిమితం చేశారు. ఈ రెండు సార్లు కూడా వైసీపీ నాయకులు తొలి రోజు వెళ్లి.. ప్రమాణ స్వీకారం చేసి వచ్చారు. రెండోసారి గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి వచ్చేశారు. ఈ రెండుసార్లు కూడా.. వైసీపీ ఇలా చేయడంపై విమర్శలు వచ్చాయి.
ప్రజలు ఎన్నుకున్న నేతలు సభకు వెళ్లకుండా ఏం చేస్తున్నారంటూ..సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశ్నలు కూడా వచ్చాయి. బయట ఎంత మాట్లాడినా.. ఎన్ని విమర్శలు చేసినా.. ప్రయోజనం లేదని సభకు వెళ్లాలని పెద్ద ఎత్తున సూచనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వస్తున్న సమావేశాలకు హాజరయ్యే విషయంలో సానుకూలంగానే వైసీపీ అడుగులు వేస్తోంది. అయితే.. ఇంతలోనే ఈ సమావేశాలు 11 చుట్టూ తిరుగుతుండడంతో తమను అవమానించేందుకే సర్కారు ఇలా చేస్తోందని నాయకులు తలపోస్తున్నారు. ఈ నేపథ్యంలో సభలకు వెళ్తారా? వెళ్లరా ? అనేది చూడాలి.