ఇవాళ అనగా జూన్ 21 ,2022 ఇంటర్నేషనల్ యోగా డే. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకుని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వరకూ అంతా ప్రజలకు విషెస్ చెబుతూ యోగా ఆవశ్యకతను చాటుతున్నారు. అయితే యోగా డే ను వైఎస్సార్సీపీ మాత్రం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఎందుకంటే దీన్నొక బీజేపీ కార్యక్రమంగానే చూస్తోంది. అందుకే ఒకరిద్దరు మంత్రులు (ఉషా శ్రీ చరణ్, చెల్లుబోయిన వేణు) లాంటి వారు తప్ప పెద్దగా ఎవ్వరూ ఈ రోజు ఆవశ్యకత గురించి మాట్లాడిన దాఖలాలు లేవు.
ఇప్పుడంటే అంతా డిజిటల్ యుగంలో పడిపోయాక, ఒంటి మీద శ్రద్ధ పోయి అనారోగ్యాల బారిన పడుతూ, తప్పక యోగా తరగతులకు వెళ్తున్నారే తప్ప ! ఆ రోజుల్లో అంటే ఎన్టీఆర్ రోజుల్లో యోగా ఆవశ్యకతను ప్రచారం చేసేవారంటే ఆశ్చర్యపోవాల్సిందే !
అవును ! ఎన్టీఆర్ దినచర్యే తెల్లవారు జామున మూడు గంటలకు ఆరంభం అయ్యేది అని అంటుంటారు. కొందరయితే రెండుకే లేచి ఆయన దైనందిన కార్యక్రమాలు ఆరంభిస్తారని కూడా అంటుంటారు. ఏదేమయినా ఆయన ప్రతిరోజూ ఆసనాలు వేసేవారు. యోగాకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఫిట్నెస్ కు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆహార నియయాలు పాటించేవారు. మద్యం ముట్టేవారు కాదు.
దేవుడి పాత్రల్లో ఒదిగిపోయేవారు. ఆ పాత్రలు పోషించే వేళ,ఆయా చిత్రాలలో నటించే వేళ తప్పక కటిక నేలపై నిద్రించేవారు. ఇంకాచెప్పాలంటే సాంసారిక సుఖాలకు ఆయన దూరంగా ఉండేవారు. ఇవన్నీ ఎన్టీఆర్ జీవితం నేర్పిన ఆరోగ్య సూత్రాలు. వీటిలో కొన్ని ఇప్పటికీ బాలకృష్ణ పాటిస్తారు. ఇకపై అంతా పాటించాల్సిందే కూడా !
అంత మంచి నియామాలను ఎలా వదిలేస్తాం చెప్పండి.కనుక యోగాకు బ్రాండ్ అంబాసిడార్లను వెతుక్కోవక్కర్లేదు. వారికి కోట్ల రూపాయలు ముట్ట జెప్పి శరీర ఆరోగ్యం, మనోల్లాసం తదితర విషయాలపై అదే పనిగా స్పీచులు ఇప్పించాల్సిన పని కూడా లేదు.
శుభ్రంగా యోగా చేయడం మరువకండి అని ఆనాడే ఎన్టీఆర్ చెప్పారు. ఆ మాట పాటిస్తే చాలు. హ్యాపీ యోగా డే టు ఆల్.. చిత్రంలో కనిపిస్తున్న బొమ్మను ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ శివప్రసాద్ దాకోజు వేశారు. నా మిత్రుడు యోగామాస్టర్ వేణు రాసిన ఎన్టీఆర్ ఆరోగ్య రహస్యం యోగా బుక్ కవర్ పెయింటింగ్ ఇది అని ఎఫ్బీ వేదికగా చెబుతున్నారాయన.