అవహేళలనలు, అవమానాలు భరిస్తూతెలుగు వారంతా మదరాసీలుగా పిలవబడుతున్న రోజులవి.
ఉత్తరాది వారి ఏలుబడిలో, తమిళుల పంచలో తలొంచుకు బతుకుతున్న తెలుగుజాతి, ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిన సందర్భంలో నందమూరి చేసిన సింహ గర్జన యావత్ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ఎన్టీవోడి గర్జన నుంచి పుట్టిన వేడిగాలి దావానలంలా వ్యాపించి, తెలుగువారి వాడి, వేడి, పౌరుష ప్రతాపాల ప్రభావాన్ని విశ్వ వ్యాపితం చేసింది. అతడే ఒక సైన్యం, అతడే ఒక ప్రేరణ, అతడి మాటే వేదం, ఆయన పిలుపే ప్రభంజనం, అన్ని యుద్దాలు తానే చేశాడు, అన్ని ప్రయాణాలు తానే సాగించాడు, అన్ని తానై ముందుకు నడిచి అందరిని తన వెంట నడిపాడు, ఆయన మాట శిరోధార్యంగా మలిచారు ఎన్టీఆర్.
రాజకీయ రణక్షేత్రంలో అడుగుపెట్టే నాటికి రాజకీయ శూన్యత, రాజకీయ అస్థిరత్వం రాజ్యమేలుతోంది. స్వచ్చంధంగా సామాన్యుడి సేవ చేయడానికి వేదిక రాజకీయ రంగం. దానిని కాస్త లాభసాటి వ్యాపార రంగంగా మార్చారు. అవినీతి, అక్రమార్దనపరుల, నేరస్థులకు నెలవుగా మారింది. “ బ్రతకడానికి రాజకీయాల్లోకి రావద్దు, బ్రతుకులను మార్చడానికి రాజకీయాల్లోకి రండి, ఎందుకంటే రాజకీయం ఉద్యోగం కాదు ఒక సామాజిక బాధ్యత” అని నినదించాడు. తెలుగుజాతి యావత్తు ప్రేమగా అన్నా అని పిలుచుకునే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. ఆయన వ్యక్తి కాదు మహా శక్తి, ఒక
తరాన్ని శాసించాడు, ఒక తరాన్ని ప్రభావితం చేశాడు. ఒక తరానికి మార్గదర్శకుడయ్యాడు.
వందల తరాలు తన బాటలో నడిచేలా చేశాడు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 99వ జయంతి వేళ సంబరాలు అంబరాన్నంటుతున్న శుభవేళ ఆయన స్మరణం సదా సంతోషదాయకం. ఆయన జయంతి ఉత్సవాలు భారతదేశానికే పరిమితం కాకుండా అన్ని దేశాల్లో జరుపుకుంటున్నారు. మే 21, 22లో యూఎస్‌ఏ లోని బోస్టన్ మహానగరంలో వేలాది మంది సమక్షంలో జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.
రాజకీయాల్లో ఉన్నది పుష్కర కాలమే అయినా ప్రజల మదిలో చెరగని ముద్రవేసిన ఎన్టీఆర్ ఖ్యాతిని, చరిష్మాను ఆంగ్ల ప్రసార మాధ్యమాలు కూడా కొనియాడాయి. బ్రిటన్ వారపత్రిక ‘ది ఎకనమిస్ట్’ ప్రత్యేక సంకలనం ద బుక్ ఆఫ్ అబీచ్యువరీస్ లో అన్నగారి జీవిత విశేషాల సమాహారం ముద్రితమైంది. ప్రపంచ వ్యాప్తంగా 400 మంది జీవిత విశేషాలను దానిలో ముద్రించగా, దక్షిణ భారతానికి చెందిన ముగ్గురిలో ఒకరిగా ఎన్టీఆర్ నిలిచారు.
సామాజిక విప్లవోద్యమనేత నందమూరి తారక రామారావు. జాతి నిర్మాణం వైపు ప్రజలను జాగృతం చేసి తన ఆలోచనలు, ఆవేశంతో నేటి తరానికి స్పూర్తి ప్రధాతగా నిలిచారు. ప్రజల కోసం, ప్రజల్లో కలిసి, ప్రజానేతగా ప్రజల్లో ఒకడిగా రామన్న సాగించిన పయనం ప్రభంజనమే.ప్రజాకర్షక పాలనతో, ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలనకు బాటలు వేసి భారత రాజకీయ చరిత్రలో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి పేదల అభివృద్దికి శ్రీకారం చుట్టారు.
కొంత మందికి రాజకీయాలు వృత్తి, వ్యాపారాలుగా మారిన నేపథ్యంలో సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి, ప్రజాసేవకు పాతరేసిన తరుణంలో ఎన్టీఆర్ నీతి, నిజాయితీ, నిరాడంబరత,పట్టుదల, సాహసం, పని తీరు ప్రతి ఒక్క తెలుగువాడు ఆదర్శంగా తీసుకోవాలి. ఒక మహానటుడిగా, మనందరి నాయకుడిగా తెలుగు ప్రజల నీరాజనాలందుకున్నాడు. ప్రజా
జీవితంలో, రాష్ట్ర రాజకీయాల్లో ప్రమాణాలు, విలువల గురించి చెప్పుకున్నప్పుడల్లా ప్రథమంగా గుర్తుకొచ్చేది ఆ మహోన్నత వ్యక్తే. భారత రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల వ్యవస్థకు ప్రత్యేక స్థానాన్ని కల్పించిన చారిత్రక మూర్తిగా, తెలుగుదనపు తియ్యదనాన్ని జాతీయంగా,అంతర్జాతీయంగా చవిచూపించిన తెలుగు వల్లభునిగా చరిత్రలో నిలిచిపోయారు.
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని తలచి సంక్షేమ రాజ్యం సృష్టించి సమసమాజ నిర్మాతగా,.లౌకికవాదిగా నందమూరి తారక రామారావు పేరు ప్రఖ్యాతులు పొందారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి సినీ వినీలాకాశంలో సాటిలేని ధ్రువతారగా వెలుగొంది, తన నటనా కౌశలంతో 300కు పైగా చిత్రాల్లో నటించి దేశ వ్యాప్తంగా ప్రజల మనసులను కొల్లగొట్టారు. 6 దశాబ్దాల సుదీర్ద నట ప్రస్థానంలో ఎదురులేని రారాజుగా వెలుగొందాడు. అందమైన రాముడిగా, కృష్ణుడిగానే కాదు. రీవీ, రాజసం ఉట్టిపడే దుర్యోధనుడు, రావణాసురుడు లాంటి ప్రతినాయక పాత్రలు పోషించి ఆయా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి జీవం పోశాడు. అతని శ్వాస, ధ్యాస, ఘోష తెలుగు. కొన ఊపిరితో కొండెక్కుతున్న తెలుగు జ్యోతికి జీవం పోసిన ప్రధాత. ఒక అరుదైన సుందర సాంస్కృతిక స్వప్నాన్ని సాకారం చేశారు.
ఒక అద్బుత కళావైభవ ప్రాభవాలను ఆవిష్కృతం చేశాడు. అక్షర సేధ్యంతో తెలుగు భాషను సుసంపన్నం చేశాడు. అమ్మ భాషలోని కమ్మదన్నాన్ని మాతృభాషలోని మాధుర్యాన్ని తెలుగు ప్రపంచానికి రుచి చూపించాడు. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడిగా విరాజిల్సి, అశేషాభిమానాన్ని చూరగొన్నారు.
కులాలు, మతాలు, కూలిన విధానాలతో కుళ్లిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి నూతన రాజకీయ సంస్కృతిని తీసుకురావడమే ఎన్టీఆర్ ఆశయం. నాటి ఢిల్లీ పెద్దలు ఏడాదికి నలుగురు ముఖ్యమంత్రులను మారుస్తూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢీల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టారు. తెలుగు జాతి ఖ్యాతిని పునర్జీవింప చేయడానికి తన 60వ ఏట రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశానికి జీవం పోసి దేశ రాజకీయాల స్వరూపాన్నే మార్చేశారు. అందుకే 9
నెలలకాలంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, నియంతృత్వ పోకడలపై తిరుగుబాటు చేసి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలుగుదేశం బావుటాను ఎగురవేశారు.
1983-మే లో తొలిసారి నిర్వహిచిన మహానాడుకు దేశం నలుమూలల నుంచి జాతీయ నేతలు సైతం హాజరై,
అన్నగారి ఖ్యాతిని కొనియాడారు. అదే ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన సాధించినవిజయం దేశ రాజకీయ అంకంలో అపూర్వఘట్టం.
1984 ఆగష్టు 16న నాదెండ్ల భాస్కరరావు, అప్పటి గవర్నర్ రాంలాల్, ప్రధాని ఇందిరా గాంధీల లోపాయికారీ సహకారంతో రామారావును అధికారం నుంచి తొలగించి దొడ్డిదారిన గద్దెనెక్కారు. ఆ సమయంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటంలో ఆయన విజయం సాధించిన తీరు జాతీయ స్థాయిలో ఎప్పటికీ నభూతోనభవిష్యత్ అనే చెప్పాలి. నాడు ఆయన చూపిన ధైర్య సాహసాలు రాజకీయ రంగలో రారాజుగా నిలిపాయి.
ఎన్టీఆర్ పథకాలు ఎప్పటికి ఎవర్ గ్రీన్…
తన అధ్గుతమైన పాలనతో రామారాజ్యాన్ని మరిపించారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, సగం ధరకే చేనేత వస్తాలు, వితంతువులకు, కూలీలకు పింఛన్ల పంపిణీ వంటి వినూత్న పథకాలకు ఆయనే ఆదిగురువు. రాయలసీమ వాసుల దాహార్తిని తీర్తేందుకు తెలుగు గంగ, అదే నీటితో చెన్నై వాసుల దాహార్తి తీరడం, మహిళా విశ్వ విద్యాలయం, ప్రజా సదస్సులు, వంటి కార్యక్రమాలకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్, పట్వారీల వ్యవస్థ రద్దు, ప్రధానంగా అధికార వికేంద్రీకరణ జరగాలి. ప్రజల వద్దకే పాలన రావాలి, ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ వ్యవస్థలు ఉండాలి, స్థానిక సంస్థలు బలోపేతం కావాలని మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టాడు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి మునుపు అధికారం కొన్ని వర్గాల గుత్తాధిపత్యంలో ఉండేది. ఆ సమయంలో మిగతా కులాల వారికి రామారావు ఆశాకిరణంలాగా కనిపించారు. ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలవారికి పార్టీలో ఉన్నతపదవులు కల్పించారు. అన్ని వర్గాలకు నూతన యువతరానికి చెందిన సామాన్యులకు, విద్యావంతులకు, మహిళలకు కేటాయించి రాజకీయాలను సామాన్యుల చెంతకు చేర్చారు. మహిళలు, జీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం
మైనారిటీలకు రాజ్యాధికారం కల్పించారు. ఎందరో కొత్త వారిని, బాగా చదువుకున్న వారిని రాజకీయాలకు పరిచయం చేసి, ఒంటి చేత్తో వారిని గెలిపించిన ప్రజా నాయకుడిలా చరిత్రలో నిలిచారు. సరికొత్త తరాన్ని, వినూత్న సేవా సంస్కృతిని రాజకీయాల్లో ప్రవేశపెట్టిన ”భారత ప్రజాస్వామ్య దిక్సూచి” ఎన్టీఆర్.
జాతీయ పార్టీల నాయకులు వారి ఇలాఖాలకే పరిమితమైన వేళ, ఎన్టీఆర్ తన ఛరిష్మాతో జాతీయ నేతగా ఎదిగారు. అన్న అరంగేట్రం జరక్కమునుపు, అప్పటి వరకు ఢిల్లీ పాదుషాల తాకట్టులో ఉన్న తెలుగు వారి ఆత్మగౌరవ దాస్య శృంఖలాలను స్వేచ్చనే ఖడ్గంతో తెంచి వేసి, ఖండాంతరాల్లో తెలుగు జాతి కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాడు. అప్పటికే ఇందిరాగాంధీ హత్య నుంచి పుట్టిన సానుభూతి పవనాలు దేశమంతా బలంగా వీస్తున్నాయి. కానీ సానుభూతిని తనnసమరస్ఫూర్తితో అధిగమించిన ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం విజయ దుందుభి
మ్రోగింఆచేలా చేశాడు.
నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా…
రాష్ట్రంలో 42 లోక్ సభా స్థానాల్లో 35 గెలిచి పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షహోదా సాధించింది.
జాతీయ పార్టీ జీజేపీ 2 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో నందమూరి తారక రామారావు జాతీయస్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు అనేక సమ్మేళనాలు (కాంక్షేవ్స్ లు) నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో నేషనల్ ఫ్రంట్ కు 192 స్థానాలే లభించాయి. కాంగ్రెస్ కు ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు రాలేదు. ఈ క్రమంలో వీపీసింగ్ నాయకత్వంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు కోసం ఉప్పునిప్పులా ఉండే రాజకీయ పక్షాలైన వామపక్షాలు, భారతీయ జనతా పార్టీల మద్ధతును ఎన్టీఆర్ కూడగట్టారు.
నాటి సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగుదేశం తరుపున పర్వతనేని ఉపేంద్ర మంత్రిగా పనిచేశారు. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం పనిచేసింది నిండా 11 నెలలే అయినా ప్రజాహిత నిరర్ణయాలనే అమలుచేసింది. నందమూరి నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ అయ్యేటప్పటికి బోఫోర్స్ ముడుపులకేసులో కాంగ్రెస్ పీకల్లోతులోమునిగింది. కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచేందుకుగాను నేషనల్ ఫ్రంట్ 105 మంది ఒకేసారి లోక్ సభ సభ్యతాలకు రాజీనామాచేశారు. ఇందుకోసం ఎన్టీఆర్ స్వయంగా ఎంపీలను ఒప్పించేందుకు కృషిచేశారు.
దేశవ్యాప్తంగా రైతులకు పదివేలలోపు రుణాలను రద్దుచేసేందుకు ఉపప్రధాని దేవీలాల్ ను ఎన్టీఆర్ ఒప్పించారు. అవినీతి అంతానికి లోక్ పాల్ బిల్లు, ప్రసారభారతి బిల్లు ఆమోదించారు. అంబేద్కర్ కు భారతరత్న ప్రకటించడం, ఆయ చిత్రపటాన్ని పార్లమెంటరీ హాలులో ఆవిష్కరింప చేయడమే కాక, మహ్మద్ ప్రవక్త జయంతిని జాతీయస్థాయిలో సెలవు దినంగా ప్రకటింపచేశారు. జాతీయ రాజకీయాలను జనం మెచ్చేలా ప్రభావితం చేసి వాటిలో కీలక పాత్ర పోషించిన తొలి ముఖ్యమంత్రి ఎన్టీఆర్.
రాష్ట్ర సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ విధానాలు అనుసరించడం తెలుగుదేశం పార్టీతో మొదలైంది. పార్టీ ఆవిర్భావం నుండి స్పష్టమైన సిద్దాంతాలు, విధానాలు, జాతీయ దృక్పథం, ఉన్నత రాజకీయ విలువలతో ఏ ఆశయాల కోసమైతే ఎన్టీఆర్ పార్టీని స్థాపించారో అవే ఆశయాల కోసం 4 దశాబ్దాలుగా ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో కుటిల రాజకీయాలను ఎదుర్కొంటూ ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. దేశ సమకాలికుల్లో ఎన్టీఆర్ వంటి ప్రజా నాయకుడు మరొకరులేరు, ఎన్నటికీ ఉండబోరు. ప్రజా నాయకుడిగా చరిత్రలోనే కాదు ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ స్థానం సుస్థిరం. ఆయన కీర్తి అజరామరం. అందుకే ఆ మహానుభావుడికి భారతరత్న ఇవ్వాలని యావత్ తెలుగు జాతి కోరుకుంటోంది. దేశ విదేశాల్లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఏడాది పాటు ఘనంగా జరుపుతున్నారు.
మన్నవ సుబ్బారావు
తెలుగుదేశంపార్టీసీనియర్‌నయకులు
(మే 28న స్వర్గీయ నందమూరి తారక రామారావు 99వ జయంతి సందర్భంగా)