సాధారణంగా స్టార్ హీరోల చూపు హిట్ డైరెక్టర్ల వైపే ఉంటుంది. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. హిట్టు కొట్టి సక్సెస్ జోష్ లో ఉన్న దర్శకులతో కన్నా.. ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్లతో సినిమా చేసి హిట్ కొట్టడం ఎన్టీఆర్ నైజం. రీసెంట్ టైంలో ఎన్టీఆర్ నుంచి వచ్చిన చిత్రం `దేవర పార్ట్ 1`. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే దేవర కన్నా ముందు కొరటాల తెరకెక్కించిన `ఆచార్య` చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన `అరవింద సమేత వీర రాఘవ` మూవీ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. కానీ అరవింద సమేత కన్నా ముందు త్రివిక్రమ్ తీసిన `అజ్ఞాతవాసి` చిత్రం దారుణమైన ఫలితాన్ని మూటకటుకుంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. 2017లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన `జై లవకుశ` చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ఈ మూవీకి బాబి కొల్లి డైరెక్టర్. అయితే ఈయన గత చిత్రం `సర్దార్ గబ్బర్ సింగ్` ఫ్లాప్ అవడం గమనార్హం.
20016లో సుకుమార్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేసిన `నాన్నకు ప్రేమతో` చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. కానీ అదే సుకుమార్ ఎన్టీఆర్ కన్నా ముందు మహేష్ బాబుకు `1 నేనొక్కడినే` మూవీతో పెద్ద డిజాస్టర్ ను అందించాడు. 2015లో ఎన్టీఆర్ పోలీస్ పాత్రలో నటించిన `టెంపర్` మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పూరీ జగన్నాథ్ ఈ మూవీకి దర్శకుడు. అయితే టెంపర్ కన్నా ముందు పూరీ సైతం వరుస ప్లాపుల్లో మునిగిపోయి ఉన్నాడు. అయినప్పటికీ ఎన్టీఆర్ ఆయనకు ఛాన్స్ ఇచ్చి హిట్ కొట్టాడు.
ఇక అంతకన్నా ముందు `మున్నా` మూవీతో ప్రభాస్ కు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ వంశీ పైడిపల్లితో ఎన్టీఆర్ `బృందావనం` సినిమా చూశాడు. ఈ చిత్రం కూడా విజయం సాధించింది. మొత్తంగా ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేసి హిట్ కొట్టడం అనేది ఎన్టీఆర్ కు బాగా కలిసి వచ్చిన సెంటిమెంట్ గా చెప్పుకోవచ్చు. అన్నట్లు ఈ రోజు ఎన్టీఆర్ 42వ పుట్టినరోజు. దాంతో ఆయనకు అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా బర్త్‌డే విషెస్ చెబుతున్నారు.