అమరావతి రైతులు, మహిళల కష్టాలు చూసి చలించిపోయిన ‘సెయింట్ లూయిస్’ ప్రవాసాంధ్రులు.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వం అమరావతిపై `మూడు` మార్చుకుని మూడు రాజధానుల తంత్రాన్ని తెరమీదికి తెచ్చింది. దీంతో తాము చేసిన `భూ త్యాగం` వృథా అవడమే కాకుండా, ఐదుకోట్ల ఆంధ్రులకు కేరాఫ్ లేకుండా పోతుందనే దూరదృష్టితో రాజధాని రైతన్నలు ఉద్యమ బాట పట్టారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిలబెట్టుకునేందుకు అన్నదాతలు చేస్తున్న అకుంఠిత ఉద్యమానికి ప్రవాసాంధ్రుల నుంచి అప్రతిహత ఆపన్న హస్తం అందుతోంది. అన్నదాతల ఉద్యమానికి ‘మనం సైతం`అనే నినాదంతో ‘జయరాం కోమటి’ అమెరికా లోని ప్రవాసాంధ్రుల్లో చైతన్యం రగిలించారు.
అమెరికాలోని ‘సెయింట్ లూయిస్’ కు చెందిన ‘రాజా సూరపనేని’ ఇటీవలే జరిగిన ‘తానా’ ఎన్నికలలో ప్రత్యర్థి వర్గం పట్టుబట్టి ఓడించినా, తెలుగు సమాజానికి సేవ చేసే తనలోని అంకిత భావాన్ని మాత్రం ఓడించలేరని నిరూపిస్తూ, అమరావతి రైతన్నల ఉద్యమానికి ఆర్థికంగా సాయం చేయాలని సంకల్పించుకున్నారు.
ఈ క్రమంలో తొలి విడతలో ‘ సెయింట్ లూయిస్’ లోని తెలుగు వారి సహాయముతో 22,200డాలర్లను సేకరించి, ఈ మొత్తాన్ని `NRIsForAmaravati` కోశాధికారికి చెక్కు రూపంలో అందించారు. అంతేకాదు, ఒక రాష్ట్రం-ఒకే రాజధాని’ నినాదంతో ఉద్యమిస్తున్న అమరావతి ఉద్యమాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, రైతులకు, మహిళలకు తమ వంతు ఆర్థిక, హార్దిక సహాయ, సహకారాలు ఉంటాయని ‘సెయింట్ లూయిస్’ ప్రవాసాంధ్రులు ప్రతిజ్ఞ చేశారు.
రజనికాంత్ గంగవరపు,కిషోర్ యార్లగడ్డ, సందీప్ గంగవరపు, కిషోర్ ఎరపోతిన మరియు వంశీ పాతూరి చేసిన కృషిని ప్రవాస ఆంధ్రులు అభినందించారు.
తమకు అండగా నిలిచిన ‘సెయింట్ లూయిస్’ ‘ ప్రవాసాంధ్రులకు అమరావతి రాజధాని రైతులు, మహిళలు ధన్యవాదాలు తెలిపారు.