మరికొద్ది గంటల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పొరుగు రాష్ట్రాలలోని ఏపీ ఓటర్లు, విదేశాల నుంచి ఎన్నారై లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సాధారణంగా ఏదో వచ్చామా ఓటు వేశామా అన్న రీతిలో కాకుండా చాలామంది ఎన్నారైలు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవాలని ఊరూవాడా తమ వంతు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
ఎన్నారై టీడీపీ కీలక నేత దొడ్డపనేని సాగర్ ఆధ్వర్యంలో అమెరికాతో పాటు పలు దేశాలలోని ఎన్నారై టీడీపీ నేతలు ఏపీలో ముమ్మరంగా కూటమి తరఫున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వారంతా ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఎన్నారై టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.
ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఉభయగోదావరి జిల్లాలలో ఎన్నారై టీడీపీ నేతలు కాళ్లకు బలపం కట్టుకుని ప్రచారం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని చెబుతున్నారు. కూటమి తరఫున బరిలో దిగిన అభ్యర్థులు గెలిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఓటర్లకు వారు వివరిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, అమరావతి రాజధాని నిర్మాణం పూర్తవుతుందని, అప్పుల ఊబి నుంచి ఏపీ బయటపడుతుందని చెబుతూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు.