మంగళగిరిలో ఎన్నారై అకాడమీ కథ రకరకాల మలుపులు తిరుగుతూ వుంది. ప్రస్తుతం అడ్మినిస్ట్రేటర్ గా వున్న మాజీ డిజిపి మండవ విష్ణువర్ధన్ రావు ని తప్పించాలని 12th ADJ Court తీర్పు చెప్పడం మేఘా కృష్ణారెడ్డి వర్గానికి వూపు ఇచ్చినట్టుయింది.
ఈ కాలేజిని అధికారం అండతో ఎలాగైనా చేజిక్కించుకోవాలని మేఘా కృష్ణారెడ్డి ఒక వైపు, చేజార్చుకోకూడదని డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ వర్గం మరోవైపు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తూనే వున్నారు.
ఎన్నారైని మేఘా పరం చేసేందుకు విజయవాడ ప్రముఖుడు లింగమనేని రమేష్ విఫలప్రయత్నాలు చేస్తూనే వున్నాడు.
2002లో 30 మంది సభ్యులు కలిసి స్థాపించిన ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో కొందరు సభ్యులు ముక్కామల అప్పారావు నేతృత్వంలో మేఘా బినామీ లింగమనేని రమేష్ తో చేతులు కలిపారు.
వీళ్లంతా యాజమాన్య మార్పిడికి సిద్ధమయ్యారు.
అయితే ముందుగా హామీ ఇచ్చినట్టు లింగమనేని వీళ్లకు డబ్బు చెల్లించకపోవడంతో కొందరు సభ్యులు అడ్డం తిరిగి నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ వర్గంలో చేరడంతో నిమ్మగడ్డ వర్గానిదే పైచేయి అయింది.
అయితే ముక్కామల అప్పారావు, లింగమనేని రమేష్ సభ్యుల మధ్య గొడవలు పెట్టడంలో విజయవంతమయ్యారు.
2021లో కొందరు సభ్యులను బయటకు పంపించి కొత్త సభ్యులను చేర్చారు.
అసలైన మెంబర్లెవరో తేల్చి, వివాదాన్ని పరిష్కరించాలని హైకోర్టు ఆర్బిట్రేటర్ని నియమించింది.
హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేందర్ గుప్తా ఆర్బిట్రేటర్ గా నియమితులయ్యారు.
పాలకవర్గం మధ్య విభేదాల నేపథ్యంలో, వివాదం పరిష్కారం అయ్యేవరకు కళాశాల వ్యవహారాలు పర్యవేక్షించడానికి అడ్మినిస్ట్రేటర్ గా జార్ఖండ్ మాజీ డిజిపి మండవ విష్ణువర్ధనరావును ఆర్బిట్రేటర్ నియమించారు.
మండవ విష్ణువర్ధన్ నియామకం చెల్లదని మేఘా, లింగమనేని బ్యాకింగ్ వున్న ముక్కామల వర్గం కోర్టుకెళ్లడం, హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా వాళ్ల వాదన తిరస్కరించడం జరిగింది.
మండవ నియామకం సక్రమమేనని తీర్పు వచ్చింది.
ఆర్బిట్రేషన్ పూర్తయ్యేవరకు మండవని కొనసాగించాలని తీర్పు చెప్పారు.
ప్రస్తుతానికి నిమ్మగడ్డ ఉపేంద్ర గారి వర్గంలో మెజారిటీ సభ్యులున్నప్పటికీ వాళ్లలో కొందరిని తమకు మద్దతివ్వాలని లింగమనేని రమేష్ ప్రలోభపెడుతున్నారు.
వినని వాళ్లని అధికారం అండతో బెదిరింపులకు గురిచేస్తున్నారు.
వీళ్ల ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు మళ్లీ విష్ణువర్ధనరావు అడ్మినిస్ట్రేటర్ గా అక్రమాలకు పాల్పడుతున్నారని 12వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి ముందు పిటిషన్ వేశారు.
ప్రిన్సిపిల్ డిస్ట్రిక్ట్ జడ్జి ముందు విచారించాల్సిన కేసును కావాలని 12ఎడిజె కోర్టులో దాఖలు చేశారు.
ఈ కోర్టు మేజిస్ట్రేట్ భాస్కరరావు గతంలో వెకేషన్ బెంచ్ లో వున్నప్పుడు కూడా ఈ కేసును ఆ బెంచ్ ముందుకే తీసుకుని వెళ్లారు.
అయితే ఈ కేసు మీద ఉన్నత న్యాయస్థానం ప్రత్యేకంగా దృష్టి సారించడంతో వీళ్ల ప్రయత్నాలు ఫలించలేదు.
ఇఫ్పుడు మళ్లీ అదే మేజిస్ట్రేట్ ముందు పిటిషన్ దాఖలు చేశారు.
ముక్కామల అప్పారావు తరపున వాదిస్తున్న లాయర్ సోము క్రిష్ణమూర్తిని కాలేజి కమిటీలో మెంబర్ గా చేర్చారు.
న్యాయపరమైన లొసుగులను అడ్డుపెట్టుకోడానికి ఈయన తన సేవలు వినియోగిస్తున్నారు.
ఇదే కాలేజిలో చదువుతున్న తన కుమార్తెను ఫీజు అడిగారని అడ్మినిస్ట్రేటర్ ని బెదిరించిన చరిత్ర ఈయనది.
బెజవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పని చేసిన క్రిష్ణమూర్తి, న్యాయస్థానాల్లో తీర్పులన్నీ తానే ఇపిస్తానని బిల్డప్పులు ఇస్తుంటారు.
ఇప్పుడు 12th ADJ కోర్టు న్యాయమూర్తి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం నియమించిన అడ్మినిస్ట్రేటర్ ను తొలగించాలని తీర్పు ఇచ్చారు.
అడ్మినిస్ట్రేటర్ గా పోలీసు అధికారిని నియమించడం చెల్లదని, రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని తీర్పు చెప్పారు.
తీర్పు యావత్తు ఆర్బిట్రేటర్, అడ్మినిస్ట్రేటర్ల మీద ఆరోపణలు చేసినట్టుంది కానీ తీర్పులా లేదు.
వాస్తవానికి ఒక రాష్ట్రంలో వేలాది మంది వుండే పోలీసు యంత్రాంగాని ఆపరేట్ చేసిన అనుభవం మండవ విష్ణువర్ధనరావుది.
ఒకరకంగా చెప్పాలంటే ఆయన అడ్మిన్ గా వుండబట్టే, ఇన్ని గ్రూపు గొడవలున్నప్పటికీ, కళాశాల ప్రశాంతంగా నడుస్తోంది.
ఆయన అడ్మినిస్ట్రేటర్ గా వచ్చాక కళాశాలలో ఫండ్స్ నిర్వహణను క్రమబద్దీకరించారు.
అలాంటి వ్యక్తి అడ్మినిస్ట్రేటర్ గా పనికిరాడని తీర్పు చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తీర్పుని హైకోర్టులో సవాల్ చేసేందుకు నిమ్మగడ్డ వర్గం సిద్ధమవుతోంది.
ఈ తీర్పు అమలు జరిగితే మళ్లీ గొడవలు, పోలీసు కేసులతో ఎన్నారై కాలేజి ప్రతిష్ట కోల్పోయే ప్రమాదముంది.