దేశ రాజకీయాలలో మార్పు రావాలని ప్రముఖ ఎన్నారై, డాక్టర్ గోరంట్ల వాసుబాబు 12 ఏళ్లుగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ ప్రక్షాళన జరగాలని, రాజకీయాలలో సంస్కరణలు రావాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు ఆయన లేఖ రాశారు. ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు భారత దేశంలో అవసరమైన ఎన్నికల సంస్కరణల గురించి గత పది, పన్నెండేళ్లుగా తాను కృషి చేస్తున్నానని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ, నియమాలు, లోపాల గురించి మే 1 , 1998 న కొన్ని సూచనలను ఎన్నికల సంఘానికి పంపించానని చెప్పారు.
ఒక పార్టీపై గెలిచి…ఆ తర్వాత వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాల కోసం వేరే పార్టీలోకి మారడం బాధాకరమని వాసుబాబు అన్నారు. దాని వల్ల రాజకీయ అస్థిరత ఏర్పడుతోందని చెప్పారు. అధికారంలో ఉన్న వారు..ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను సామదాన భేద దండోపాయాలు ప్రయోగించి తమ పార్టీలోకి లాక్కోవడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. డబ్బులు వెదజల్లి ప్రతిపక్ష పార్టీల నేతలను సంతలో పశువుల్లా కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంస్కృతి మారాలని, అందుకోసం ఎన్నికల ప్రక్రియలో తగిన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పార్టీ మారే నేతలకు అడ్డుకట్ట వేసేందుకు కొన్ని సూచనలు చేశారు.
ఒక వ్యక్తి ఒక నియోజకవర్గం నుంచే పోటీ చేయాలి. ఎవరైనా సభ్యులు వేరే పార్టీలోకి మారితే…వారు ఆరు నెలల వరకు సభలో తమ ఓటు హక్కును కోల్పోయేలా చట్టం తేవాలి. వారు ఆరు నెెలల పాటు ఎన్నికలలో పాల్గొనకుండా నిబంధన విధించాలి. 2/3వ వంతు సభ్యులు పార్టీ మారితే వారు చెప్పిందే చెల్లేలా ఉన్న నిబంధనకు సవరణ చేయాలి. పార్టీ మారిన వారి సభ్యత్వం రద్దు చేసేలా నియమాలు రూపొందించాలి. వీటితో పాటు తాను చేసిన సూచనలను కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని వెంకయ్యనాయుడుకు డాక్టర్ గోరంట్ల వాసుబాబు లేఖ రాశారు.