ఈ రోజుల్లో చాలామంది ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక, ఉచిత పథకాల కోసం, ఉచితంగా వచ్చే వస్తువులు కోసం అయితే చాలామంది జనం ఎగబడుతుంటారు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగేరకం వ్యక్తులు…తేరగా వస్తే దేనికైనా ఆశపడే మనుషులు మనకు నిత్యజీవితంలో తారసపడుతుంటారు. ఇక, అదే డబ్బు రోడ్లపై చిత్తుకాగితాల్లా పడి ఉంటే…అటువంటి వారికి పండగే. తాజాగా అమెరికాలో ఇదే తరహాలో రోడ్లపై నోట్ల వర్షం కురిసింది.
ఇంకేముందు, వాటిని ఏరుకునేందుకు చిన్న పెద్దా తేడా లేకుండా జనం అంతా ఎగబడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దక్షిణ కాలిఫోర్నియా కార్ల్స్‌బడ్‌లో ఈ ఘటన జరిగింది. శాన్‌డిగో నుంచి ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కార్యాలయానికి నగదు సంచులతో వెళ్తున్న ట్రక్ నుంచి నోట్లు జారి రోడ్డుపై పడ్డాయి. ట్రక్కు డోరు ఒకటి తెరచుకోవడంతో నగదు సంచులు బయటపడి రోడ్డుపై చెల్లాచెదురుగా నోట్లు పడ్డాయి.
దీంతో, అటుగా వెళ్తున్న జనం తమ వాహనాలు ఆపి మరీ నోట్లు ఏరుకున్నారు. నోట్లను ఎగరేస్తూ….ఆనందంతో కేరింతలు కొట్టారు. దీంతో, కాలిఫోర్నియా జాతీయ రహదారిని 2 గంటల పాటు మూసివేసి నోట్లను సేకరించారు అధికారులు. ఈ వ్యవహారాన్ని వీడియో తీసి కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. హైవేపై డబ్బులు ఏరుకోడానికి అందరూ ఆగిపోవడం అత్యంత వెర్రితనం అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇక, ఈ ఘటనలో ఇద్దర్ని అరెస్టు చేయగా…12 మంది డబ్బులు తిరిగి తెచ్చిచ్చారని పోలీసులు చెబుతున్నారు. నగదు తీసుకున్నట్లు తేలితే సంబంధిత వ్యక్తులపైనా క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. నగదు తీసుకున్నవారు తిరిగి ఇచ్చేయాలని కోరారు. ఈ ఘటనపై సీహెచ్‌పీ, ఎఫ్‌బీఐలు దర్యాప్తు చేపట్టాయి.