ఔను.. ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది.
వైసీపీ కీలక నాయకుడు, మంత్రి అంబటి రాంబాబుకు ప్రతిపక్షా లు సంబరాల రాంబాబు అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.
దీనిని ఆయన యాక్సప్ట్ కూడా చేశారు.
సంక్రాంతి పండుగ నాడు.. ఎస్టీ సామాజిక వర్గం మహిళలతో కలిసి ఆయన నృత్యాలు చేశారు.
మొత్తంగా.. చూస్తే ఇప్పటికీ మంత్రి అంబటిని నియోజకవర్గంలో సంబరాల రాంబాబుగానే పిలుస్తున్నారు.
కానీ, ఇప్పుడు ఆయన పేరు మారిపోయింది.
తాజాగా ఆయనకు విపక్షాలు చీరల రాంబాబు అని పేరు పెట్టేశారు.
దీనికి కారణం.. గత రెండు మూడు రోజులుగా మంత్రి రాంబాబు మరోసారి పోటీ చేస్తున్న సత్తెనపల్లి నియోజ కవర్గంలో వరుస పెట్టి చీరల పంపిణీ జరిగిపోతోంది.
గుట్టు చప్పుడు కాకుండా.. మంగళగిరి చేనేతల నుంచి తీసుకువస్తున్న చీరలను రాంబాబు అనుచరులు ఇంటింటికీ ఉదయాన్నే వెళ్లి పంచేస్తున్నారు.
దీనిపై ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేస్తున్నాయి.
ఈ క్రమంలో అధికారులు దాడులు చేస్తున్నారు.
దాడులు చేసినప్పు డల్లా బస్తాలకు బస్తాల చీరలు వెలుగు చూస్తున్నాయి.
దీంతో వాటిని అధికారులు స్వాధీనం చేసుకుంటు న్నారు.
నారా లోకేష్‌ను దెబ్బకొట్టడంతోపాటు.. తాను గెలవాలనేది ఈ చీరల పంపిణీ వెనుక వ్యూహంగా ఉందని అంటున్నారు పరిశీలకులు.
మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ పోటీ చేస్తున్నారు.
ఇక్కడ ఈయనను దెబ్బకొట్టేందుకు చేనేతలను తమవైపు తిప్పుకొనేందుకు వారి వద్ద ఉన్న ఓల్డ్ స్టాక్ అంతా గుండుగుత్తగా రాంబాబు వర్గం కొనుగోలు చేస్తోందని తెలుస్తోంది.
తద్వారా.. వైసీపీకి సానుభూతి పెరిగి మంగళగిరిలో ఆ పార్టీ వైపు మొగ్గుతారని భావిస్తున్నారు.
ఇక, రాంబాబు వ్యవహారానికి వస్తే.. తన సొంత నియోజకవర్గంలో ఈ చీరలు పంచడం ద్వారా.. తన గ్రాఫ్‌ను పెంచుకోవాలన్నది రాంబాబు వ్యూహంగా ఉందని తెలుస్తోంది.
ఇక, సత్తెనపల్లిలోని ఓ గోదాములో వైసీపీ నేతలు నిల్వ ఉంచిన వేలాది చీరలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకోవడం దీనిని రుజువు చేసింది.
ఇవన్నీ.. మంగళగిరి చేనేతల నుంచి తీసుకున్నవేనని గుర్తించారు.
పైగా బిల్లులు లేక పోవడంతో ఇవన్నీ.. ఎన్నికల్లో పంచేందుకు తీసుకువచ్చినవేనని భావిస్తున్నారు.
జగన్ బొమ్మ ముద్రించి ఉన్న బాక్సుల్లోని 5,472 చీరలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
దీనిని టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు.. రాంబాబును చీరల రాంబాబుగా కామెంట్లు చేస్తుండడం గమనార్హం.