వైసీపీ మహిళ నేత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ కు షాక్ తగిలింది. తాజాగా కళ్యాణదుర్గం కోర్టు ఉష శ్రీ చరణ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన నేపథ్యంలో ఉషశ్రీ చరణ్ పై కేసు నమోదు అయింది. 2017 ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఉషశ్రీ చరణ్ ర్యాలీ నిర్వహించారని అప్పటి తహసిల్దార్ బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలోనే ఆ కేసుపై విచారణ జరిపిన కళ్యాణదుర్గం జూనియర్ సివిల్ జడ్జి తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ కేసు విచారణకు మంత్రి హాజరు కాకపోవడంతో ఎన్ బీడబ్ల్యూ జారీ చేయాల్సి వచ్చింది. గతంలోనూ ఉషశ్రీ చరణ్ పై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మంత్రి ఉషశ్రీ చరణ్ అనుచరులు అనంతపురం జిల్లాలో ఏకంగా చెరువును ఆక్రమించిన ఘటనపై హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది.
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం సమీపంలోని 100 ఎకరాల చెరువును మంత్రి ఉషా శ్రీ చరణ్, ఆమె అనుచరులు కబ్జా చేశారని ఆరోపణలు రావడం గతంలో సంచలనం రేపింది. ఆ ఆక్రమణలను అడ్డుకోవాలంటూ కల్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ఉమామహేశ్వర నాయుడు హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మంత్రి ఉషా శ్రీ చరణ్, ఆమె అనుచరుల పేర్లు ఆ పిల్ లో ఉండడంతో ఈ విషయం రాజకీయ దుమారం రేపింది.
ఆ చెరువును పూడ్చేసేందుకు వచ్చిన వైసీపీ నేతలకు టీడీపీ నేతలు అడ్డు తగలడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. అయితే, కొంత కాలంగా చెరువులోకి మట్టిని తరలించి పూడ్చి వేస్తున్నారని, అక్కడ ప్లాట్లు, వెంచర్లు వేసి రియల్ ధందాకు తెరతీయాలన్నది మంత్రి ఆలోచన అని ఆరోపిస్తున్నారు. ఈ ఆక్రమణల గురించి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ పిల్ లో పేర్కొన్నారు.
అంతకుముందు, ఉష శ్రీ చరణ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆమెపై సొంత పార్టీ మహిళా కౌన్సిలర్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన దగ్గర ఉష శ్రీ చరణ్ అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించడం లేదని, అదేమని అడిగితే తనను తన అనుచరులతో కొట్టించారని కల్యాణదుర్గం కౌన్సిలర్ ప్రభావతి సంచలన ఆరోపణలు చేశారు. ప్రభావతి వద్ద నుంచి ఉషాశ్రీ చరణ్ రూ.1.50కోట్లను అప్పుగా తీసుకున్నారని, అందులో రూ.90 లక్షలకు తిరిగి చెల్లించగా…మిగతా సొమ్ము ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది.