దేశంలో గర్వించదగ్గ దర్శక ప్రముఖుల్లో శంకర్ ఒకరు. భారీ బడ్జెట్ సినిమాలు తీయటమే కాదు.. వాణిజ్య చిత్రాల్లోనూ సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని ఇవ్వటం మాత్రం అస్సలు మిస్ కారు. రెండు.. మూడు అంశాలపై ఏదో ఒక సందేశాన్ని ఇస్తూ..ప్రజా ప్రభుత్వాలు చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తారు. సామాన్య.. మధ్యతరగతి జీవుల ఆవేదనను కళ్లకు కట్టేలా చూపిస్తారు.
అలాంటి ఆయనపై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయ్యింది. చెన్నైలోని ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తాజాగా దర్శకుడు శంకర్ పై వారెంట్ ను ఇష్యూ చేశారు. ఇంతకీ శంకర్ మీద ఉన్న నేరారోపణ ఏమంటే.. రోబో చిత్రాన్ని తన కథను కాపీ కొట్టి తీశారంటూ ప్రముఖ రచయిత తమిళ్ నందన్ స్థానిక కోర్టును ఆశ్రయించారు. దీంతో.. ఈ కేసు విచారణ కోసం కోర్టు ఎదుట హాజరు కావాలని పలుమార్లు ఆదేశాలు జారీ చేశారు. చాలామంది ప్రముఖుల మాదిరే.. స్థానిక కోర్టుల సమన్లను పెద్దగా పట్టించుకోలేదు.
దీంతో.. ఆయనపై తాజాగా నాన్ బెయిబుల్ వారెంట్ ఇష్యూ చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 19కు వాయిదా వేశారు. 1996లో ఒక తమిళ మ్యాగ్ జైన్ లో జిగుబా అనే కథను పబ్లిష్ చేశారు. దీన్ని కాపీ కొట్టిన శంకర్ తన రోబో చిత్రాన్ని నిర్మించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రోబో విడుదలైన 2010లో కాపీ రైట్ యాక్ట్ కింద కోర్టును ఆశ్రయించారు. దీనిపై పలు దఫాలు విచారణ జరిగి తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ ను ఇష్యూ చేశారు. దీనికి శంకర్ ఏమని బదులిస్తారో చూడాలి.