మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణి గత రెండేళ్లుగా ఓ పరువు నష్టం కేసులో విచారణ ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. 2016లో ఆర్కే సెల్వమణి, తమిళనాడులో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్బరసులు ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సమయంలో ప్రముఖ ఫైనాన్షియర్ ముకుంద్‌చంద్ బోద్రా అనే వ్యక్తి గురించి వ్యక్తిగతంగా పలు అభిప్రాయాలు వెల్లడించారు. ముకుంద్ చంద్ వల్ల తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని సెల్వమణి వ్యాఖ్యానించారు.
అయితే, ఆ వ్యాఖ్యలు తన పరువుప్రతిష్ఠలకు భంగం కలిగించాయని సెల్వమణి, అన్బరసులపై చెన్నై జార్జిటౌన్ కోర్టులో ముకుంద్ చంద్ బోద్రా పరువు నష్టం దావా వేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ముకుంద్ చంద్ బోద్రా మృతిచెందారు. బోద్రా మరణానంతరం ఆ కేసును ఆయన కుమారుడు గగన్ బోద్రా కొనసాగిస్తున్నారు. వారిద్దరూ ఈ కేసులో ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాలని కోర్టు పలుమార్లు ఆదేశించింది. అయినా సరే సెల్వమణి, అన్బరుసులతో పాటు వారి లాయర్లు కూడా కోర్టుకు హాజరు కాలేదు. దీంతో, వారిపై గత ఏడాది ఏప్రిల్ లో బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయింది.
ఈ క్రమంలోనే తాజాగా సోమవారం నాడు ఈ కేసు విచారణ జరిగింది. ఈ విచారణకు కూడా సెల్వమణి హాజరు కాలేదు. దీంతో, సెల్వమణిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చెన్నై జార్జ్‌టౌన్ కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబరు 22కు వాయిదా వేసింది.