టీడీపీ అధినేత చంద్రబాబును, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను వైసీపీ పదేపదే కొన్ని ప్రశ్నలు సంధిస్తోంది. ఒంటరిగా వెళ్లలేరా.. వెళ్లేందుకు ధైర్యం చాలడం లేదా? అని. సరే.. వీటిని పక్కన పెడితే.. గత నాలుగు రోజులుగా కొందరు మంత్రులు.. నాయకులు మరో వాదనను తెరమీదికి తెచ్చారు. 24 సీట్లే తీసుకున్నారు. వాటిలోనూ నిన్న గాక మొన్న పార్టీ తీర్థం పుచ్చుకున్నవారికి అవకాశం ఎలా ఇస్తారని నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా మచిలీపట్నం ఎంపీ సీటును వైసీపీ ఎంపీ బాలశౌరికి ఇవ్వడాన్ని వైసీపీ నాయకులు పరోక్షంగా తప్పుపడుతున్నారు. ఈయన కొత్తగా వచ్చాడు.. జెండా మోసాడా? జేజేలు కొట్టాడా? పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేశాడా? జనసేన నాయకుడు వస్తే.. ఏర్పాట్లు చేశారా? అని వైసీపీ నాయకులు నిలదీస్తున్నారు. అంతేకాదు.. ఇలాంటి వారికి టికెట్లు ఇచ్చి.. ఇప్పటి వరకు జెండా మోసిన వారిని ఏం చేయాలని అనుకుంటున్నావు్? అని కూడా నాయకులు నిలదీస్తున్నారు.
ఇక, టీడీపీ విషయంలోనూ ఇలానే నోరు చేసుకుంటున్నారు నాయకులు. ఇప్పటి వరకు ఉన్న వారిని కాదని.. తమ పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని దుయ్యబడుతున్నారు. టీడీపీకి నాయకు లు లేకుండా పోయారని ఎద్దేవా చేస్తున్నారు. అందుకే అరువు తెచ్చుకుంటున్న నాయకులకు సీట్లు ఇస్తున్నారని అంటున్నారు. కట్ చేస్తే.. పవన్ విషయం పక్కన పెడితే.. వైసీపీ ఏం చేస్తోంది? గత ఐదేళ్లు.. ఆమాటకొస్తే.. గత పదేళ్లకు పైగా జెండా మోసిన వారికి, జగన్ అంటే రక్తం ధారపోస్తామన్న వారికి ఇస్తోందా? అనేది ప్రశ్న.
తాజాగా వెలువరించిన 8వ జాబితాలో అయినా.. గత జాబితాల్లో అయినా.. చాలా మంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు. పొన్నూరు టికెట్‌ను మంత్రి అంబటి సోదరుడికి ఇచ్చారు. ఆయన ఎప్పుడూ.. జెండా మోయలేదు. ఇక, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడికి గుంటూరు ఇచ్చారు. ఆయన కూడా ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ఇప్పుడు కూడా అదే చెప్పారు. ఇప్పుడు ఆయన్ను మార్చేసి తిరిగి ఆ సీటు పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు కట్టబెట్టేశారు.
ఇక, తాజాగా ఐఏఎస్ ఇంతియాజ్‌ను పార్టీలోకి తీసుకున్నారు. ఈయనకు అసలు రాజకీయ వాసనే లేదు. మరి ఇలా ఇస్తూ.. ఇప్పటి వరకు పార్టీ జెండా మోసిన వారికి అన్యాయం చేయడం లేదా? అనేది ప్రశ్న. తాను కంబళిలో అన్నం తింటూ.. పొరుగు వారికి ఎక్కిరించడం అంటే ఇదేనని అంటున్నారు పరిశీలకులు.