బీఆర్ ఎస్ .. ఒకప్పుడు రయ్యన దూసుకుపోయిన కారు. ఒక్క తెలంగాణకే కాదు.. దేశవ్యాప్తంగా కారు తిరుగు తుందని లెక్కలు వేసుకున్న పార్టీ.. కానీ, పట్టుమని ఆరు మాసాలు తిరిగే సరికి.. అధికారం పోయి.. కీలక నేతలు చేజారి.. అలో లక్ష్మణా! అనే పరిస్థితికి వచ్చేసింది.
ఇప్పుడు బీఆర్ ఎస్ అంటే.. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు, కవితలే కనిపిస్తున్నారు.
ఒకప్పుడు కూడా వీరే కనిపించినా.. అంతో ఇంతో కొంత మంది నాయ కులు ఉండేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది.
కేశవరావు నుంచి కడియం వరకు చాలా మంది నాయకులు పార్టీని వదిలి వెళ్లిపోయారు.
అయితే.. ఇంత జరుగుతున్నా.. కేసీఆర్ పై కానీ, బీఆర్ ఎస్పై కానీ.. ఎక్కడా సానుభూతి రావడం లేదు. దీనికి కారణం.. స్వయం కృతమేనని అంటున్నారు.
గతంలో ఇతర పార్టీల నుంచి బీఆర్ ఎస్ లోకి లెక్కకు మిక్కిలిగా పార్టీ ల నేతలను లాగేసుకున్నారు.
అంతేకాదు.. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన నాయకులను కూడా.. పార్టీలో చేర్చుకుని ఏకంగా సీఎల్పీని సైతం విలీనం చేసుకున్నారు.
ఇక, టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురిని కూడా పార్టీలోకి తీసుకున్నారు.
ఇలా.. బీఆర్ ఎస్ అధినేత.. ఇతర పార్టీలను పూర్తిగా తుడిచిపెట్టేయాలన్న సంకల్పంతోనే ముందుకు సాగారు.
పైగా అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగినప్పుడు.. `మీ అభ్యర్థులను మీరు నిలబెట్టుకోవాలి.
వారు వచ్చేస్తు న్నారంటే అది మాతప్పా? మీ నాయకత్వంపై నమ్మకం లేక వచ్చేస్తున్నారు.
ఇదేమన్నా.. రాజ్యాంగ విరుద్ధమా? మేమేమన్నా.. గొంతు కోశామా? ` అని ప్రశ్నించారు.
అప్పట్లో అది కేసీఆర్ తన పద్ధతిని అలా సమర్థించుకున్నారు.
కానీ, ఇప్పుడు అంతా రివర్స్ అయింది ఇదే కష్టం బీఆర్ ఎస్ కు వచ్చింది.
ఎన్నికలు జరిగి పట్టుమని నాలుగు మాసాలు కూడా పూర్తికాకుండానే.. కారు ఖాళీ అయిపోతోంది. ఇలా ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని.. మాజీ మంత్రి కేటీఆర్ సభలోనే చెబుతున్నారు.
స్పీకర్ ప్రసాద్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. కానీ, ఈ తతంగం గమనిస్తున్నవారు.. నీవు నేర్పిన విద్యే కదా..! అని ఎదురు కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పుడు కేసీఆర్ నాయకత్వం బలహీన పడిన నేపథ్యంలోనే నాయకులు వస్తున్నారని.. వారిని నిలబెట్టుకోవడం బీఆర్ ఎస్ పని అని.. కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఎలా చూసుకున్నా.. కేసీఆర్‌పై సానుభూతి అయితే రాకపోవడం గమనార్హం.