తిరుమల పుణ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం ఎంతోమంది రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు వస్తుంటారు. అయితే, మీడియాతో మాట్లాడే క్రమంలో వారిలో కొందరు రాజకీయపరమైన వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఈ క్రమంలోనే తిరుమలలో రాజకీయరమైన వ్యాఖ్యలపై నిషేధం విధిస్తూ టీటీడీ నూతన పాలక మండలి ఇటీవల నిర్ణయం తీసుకుంది. తాజాగా నేటి నుంచి ఆ నిబంధన అమలులోకి రానుంది. తిరుమలలో నేటి నుంచి రాజకీయ వ్యాఖ్యలను నిషేధిస్తున్నామని సీపీఆర్వో టీటీడీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఒకవేళ తాము పెట్టిన నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ విమర్శలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమలలో శ్రీవారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మికత, ప్రశాంత వాతావరణం పరిరక్షించేందుకు ఈ తరహా కఠిన నిబంధనలు తీసుకువచ్చామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. అంతేకాదు, ఈ నిబంధనను రాజకీయ నాయకులతో పాటు అందరూ పాటించాలని, తిరుమల పవిత్రతను కాపాడేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.