తిరుమల లడ్డూ కల్తీ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో టీటీడీ ప్రతిష్ట గత ప్రభుత్వ హయాంలో మసకబారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీటీడీకి కొత్త పాలక మండలిని కూటమి ప్రభుత్వం ఇటీవల నియమించింది. ఈ క్రమంలోనే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో టీటీడీ నూతన పాలక మండలి తొలిసారిగా సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో సామాన్యభక్తులు త్వరగా ( గంటల వ్యవధిలో) శ్రీవారి దర్శనభాగ్యం కల్పించాలని టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను వీఆర్ఎస్ లేదా ప్రభుత్వ సంస్థలకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఏళ్ల తరబడి చెత్తతో పేరుకుపోయిన డంపింగ్ యార్డ్ లో చెత్తను మరో 3 నెలల్లో తొలగించాలని నిర్ణయం తీసుకుంది.
శ్రీనివాససేతుగా ఉన్న ఫ్లై ఓవర్ పేరును మునుపటి పేరు గరుడ వారధిగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు పూర్తిగా నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ బోర్డు..రాజకీయ వ్యాఖ్యలు చేసినవారిపై కేసులు పెట్టాలని నిర్ణయించింది. శ్రీవాణి ట్రస్ట్ పై వస్తున్న అపోహాల నేపథ్యంలో ట్రస్ట్ పేరును రద్దు చేసి టీటీడీ మెయిన్ అకౌంట్ ద్వారా లావాదేవీలు జరపాలని పాలక మండలి నిర్ణయించింది. తిరుపతి స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనభాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
పై వాటితోపాటు టీటీడీ బోర్డు తీసుకున్న పలు నిర్ణయాలు…
* టూరిజం దర్శనం టిక్కెట్లు కోటా పూర్తిగా రద్దు
* విశాఖ శారదా పీఠం నిర్మాణం పూర్తిగా నిభందనలకు వ్యతిరేకంగా జరిగిందని తీర్మానం
* విశాఖ శారదా మఠానికి ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకోవాలని నిర్ణయం
* అలిపిరి జూపార్క్ రోడ్డులో గతంలో దేవలోక్ కోసం కేటాయించిన భూమిని, ముంతాజ్ హోటల్స్ సంస్థకు గత ప్రభుత్వం కేటాయించిన భూమి లీజు రద్దు