ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు చేయాలంటే సామాన్యులు జడుసుకుంటున్నారు. ఉద్యోగ సంఘాల నేతలకు అయితే జ్వరం వస్తోంది. సీఎంని విమర్శించే ప్రాథమిక హక్కు ప్రజలకు లేదు. ఎవరైనా ఆ హక్కను వాడుకుంటే ఏదో ఒక కేసులో జైలు పాలు చేస్తారు.
దీంతో ఏపీ ప్రజలు మౌనంగా జగన్ పాలనను భరిస్తున్నారు. ఒకవైపు కరోనాతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వారి సమస్యలపై ఏ మంత్రీ మాట్లాడటం లేదు. కానీ జగన్ పగ ప్రతీకారాల కోసం అందరు కట్టగట్టుకుని పనిచేస్తున్నారు.
రఘురామరాజు ఉదంతమే దీనికి ఉదాహరణ. ఆయనను గుంటూరులోని రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని హైకోర్టు చెప్పినా లెక్కచేయకుండా జైలుకు తరలించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.
తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమా మహేశ్వరరావు స్పందించారు.
‘రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ కనుమరుగు అయింది. ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇదేనా పరిపాలన చెయ్యడం అంటే? భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 14 ని కాల రాస్తున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది’ అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.
‘కక్ష సాధింపుపై పెట్టిన శ్రద్ధ ప్రజల ప్రాణాలు కాపాడటంలో పెట్టాలని సీఎం వైఎస్ జగన్ కు దేవినేని ఉమా మహేశ్వరరావు సూచించారు.
కరోనా కోరల్లో పల్లెలలు విలవిలలాడుతున్నాయి. 24 గంటల్లో 24,171 కేసులు. రోజుకు 100 పైన మరణాలు. అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదంటున్నారు.