తెలంగాణలోకి ఏపీ ధాన్యం రాకుండా పెద్ద ఎత్తున చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. ధాన్యం కొనుగోళ్లపై కొన్నిరోజుల పాటు టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడిచిన తర్వాత చివరకు రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొంటుందంటూ టీఆర్ఎస్ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ రైతులకు నష్టం జరగకుండా ఉండేందుకంటూ కేసీఆర్ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా అడ్డుకోవాలని నిర్ణయించింది.
పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చే ధాన్యాన్ని నియంత్రించేందుకు రాష్ట్రం నలుమూలల 51 చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లుగా బుధవారమే మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు.
మంత్రి ప్రకటనను అనుసరించి బుధవారం రాత్రి నుంచే ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో తెలంగాణ చెక్‌పోస్టులు ఏర్పాటైపోయాయి.
ఇదేమీ తెలియని ఏపీకి చెందిన కొందరు తమ ధాన్యాన్ని లారీల్లో తెలంగాణ మీదుగా తరలించే యత్నం చేశారు.
ఈ లారీలను సూర్యాపేట జిల్లా పరిధిలోని రామాపూర్ క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌కు చెందిన అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆ లారీలు తిరిగి ఏపీకే వెళ్లిపోయాయి.