లాక్ డౌన్ తర్వాత పునఃప్రారంభం అయిన థియేటర్లు.. దేశవ్యాప్తంగా 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తున్న సంగతి తెలిసిందే. కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఒకప్పట్లా 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడుపుకునేందుకు ఇటీవలే అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.
సంక్రాంతి తమ చిత్రం మాస్టర్ విడుదల కాబోతున్న నేపథ్యంలో హీరో విజయ్ వెళ్లి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసి 100 శాతం ఆక్యుపెన్సీ కోసం విజ్ఞప్తి చేయడం.. కొన్ని రోజుల్లోనే ప్రభుత్వం ఈ మేరకు జీవో విడుదల చేయడం తెలిసిన సంగతే. ఐతే ఇందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు.
కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడపడం సురక్షితం కాదని, అందుకే ఈ దిశగా ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోం శాఖ నుంచి తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ వచ్చింది. ఇది కేవలం సూచనగా భావించట్లేదు. ఆదేశమే కావచ్చని భావిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులిస్తూ ఇటీవల ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకుంటుందనే అంటున్నారు.
తమిళనాడు ఇలా అనుమతులు ఇవ్వగానే.. తెలుగు రాష్ట్రాల్లోనే కాక చాలా చోట్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు 100 శాతం ఆక్యుపెన్సీ కోసం విజ్ఞప్తులు వెళ్లాయి. తెలంగాణ, ఏపీల్లో కూడా సంక్రాంతి సినిమాలకు కలిసొచ్చేలా ఈ దిశగా అనుమతులు రాబోతున్నాయని కూడా ప్రచారం జరిగింది. కానీ ఇంతలో కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకోవడంతో తమిళనాడు ప్రభుత్వం జీవోను వెనక్కి తీసుకుంటోందనిపిస్తోంది. అదే జరిగితే మరెక్కడా కూడా ఇప్పట్లో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు రాకపోవచ్చు.