కరోనా దెబ్బకు అన్ని దేశాలతోపాటు భారత దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరోనా తర్వాత ప్రవేశపెట్టబోతోన్న తొలి బడ్జెట్ పై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే భారత ఆర్థిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ భారతదేశ చరిత్రలో తొలిసారిగా కాగిత రహిత బడ్జెట్ నేడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ప్రధాని మోదీ హయాంలో 9వ బడ్జెట్ ప్రతిపాదనలను మేడ్ఇన్ ఇండియా బహీ ఖాతా ఎర్ర రంగు ట్యాబ్ లో సభ ముందుకు తీసుకువచ్చారు. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన నిర్మల…. కరోనాతోపాటు అనేక సంక్షోభాలను ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమించామన్నారు. కరోనా కేసులను కట్టడి చేసి ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించగలిగామని, ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కలిగించే అన్ని అంశాలను బడ్జెట్లో పొందుపరిచామని తెలిపారు. 100 దేశాలకు మనం కరోనా టీకాలను సరఫరా చేస్తున్నామని, ప్రపంచం మొత్తం మనదేశం వైపు చూస్తోందని నిర్మల చెప్పారు.
కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం 35వేల కోట్లుకేటాయించామని తెలిపారు. రూ.64,150 కోట్లతో ఆత్మనిర్భర భారత్ పథకం కింద రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని నిర్మల అన్నారు. 6 సంవత్సరాలకు గాను 64వేల 180కోట్లరూపాయలతో ఆత్మనిర్భర్ హెల్త్ యోజన పేరుతో కొత్త పథకం ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని, కొత్తగా బీఎస్ఎల్-3 ప్రయోగశాలలు 9 ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాహన పొల్యూషన్ను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న నిర్మల….పర్యావరణహిత వాహనాలపై ఫోకస్ చేస్తున్నామన్నారు. వ్యక్తిగత వాహనాలు 25 ఏళ్లు, కమర్షియల్ వాహనాలు 15 ఏళ్లుగా నిర్ధారించామన్నారు. నేషనల్ డిసిజ్ కంట్రోల్ సిస్టం మరింత పటిష్టం చేస్తామని, దేశ వ్యాప్తంగా 15 ఎమర్జెన్సీ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశామని తెలిపారు.