అమెరికాలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎఎంఫ్), ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశాల్లో భాగంగా ఎఫ్ఏటీఎఫ్ మంత్రుల సమావేశం జరిగింది. భారత్ తరఫున ఈ సమావేశానికి ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు.తన పర్యటనలో భాగంగా మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికాకు చెందిన అంతర్జాతీయ సంస్థలు ఫెడ్ఎక్స్, మాస్టర్‌కార్డ్ సీఈవోలతో భేటీ అయ్యారు. యాక్సెంచర్ చీఫ్ జూలీ స్వీట్, మాస్టర్ కార్డ్ సీఈవో మిబాచ్ మైకేల్, డెలాయిట్ సీఈవో పునీత్ రంజన్‌తోనూ సీతారామన్ సమావేశమయ్యారు.
ఈ క్రమంలోనే కాలిఫోర్నియాలోని సిలికాన్ ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ రిసెప్షన్ లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ కరెన్సీ వల్ల మనీ ల్యాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీతో నియంత్రణ చేయాలని, కానీ, నియంత్రణ కోల్పోతే దేశానికే సమస్య అని చెప్పారు. కొవిడ్ టైమ్ లో డిజిటల్ లావాదేవీలపై ఆధారపడ్డ వారి సంఖ్య భారీగా పెరిగిందన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ లో భారత్ ఎంతో ముందుకు సాగిందన్నారు.
క్రిప్టో కరెన్సీలు అత్యంత ప్రమాదకరమని, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులకు, మనీ లాండరింగ్‌కు ఈ కరెన్సీలను వాడుకునేందుకు అవకాశం ఉందని అన్నారు. వీటికి చెక్ పెట్టేందుకు ఉన్న ఒకే ఒక్క పరిష్కారం టెక్నాలజీ ద్వారా నియంత్రించడమేనని అన్నారు. టెక్నాలజీ ద్వారా రెగ్యులేట్ చేయడంలో దేశాలు వెనక్కి తగ్గకూడదని అన్నారు. 5జీ టెక్నాలజీ పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతోందన్నారు. డిజిటల్ బ్యాంకులు, డిజిటల్ కరెన్సీలను, డిజిటల్ యూనివర్సిటీలను ప్రోత్సహించాలన్నారు. గ్లోబల్ యూనివర్సిటీల ఆవశ్యకత గురించి ఆమె మాట్లాడారు.
భారత్ ప్రస్తుతం అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను కలిగి ఉందని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ చెప్పారు. భారత్‌లో ఉన్న ప్రతి 4 స్టార్టప్‌లలో ఒకటి ఫిన్‌టెక్ అని, ఇవి యూనికార్న్‌లుగా వృద్ధి సాధిస్తున్నట్టు వెల్లడించారు. గత మూడు నుంచి నాలుగేళ్లలో దేశంలో 20 స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా(1 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ వాల్యుయేషన్ పెరగడం) మారాయని తెలిపారు. ఎంఎస్ ఎంఈల ద్వారా చిరు పరిశ్రమలకు తమ ప్రభుత్వం ఊతమిస్తుదన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆహ్వానితులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు.
కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా పేరుగాంచిన ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజస్వామి, శ్యామా శాస్త్రిల పెద్ద పెద్ద చిత్రపటాలు ఆడిటోరియంలో ఉండడం గమనించిన నిర్మలా సీతారామన్.. ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఆ మహనీయుల్లో ఒక్కొక్కరి గొప్పదనం గురించి ఆహూతులకు అద్భుతంగా వివరించారు. భారతీయ కళల సంరక్షణకు కృషి చేస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ నిర్వాహకులను ఎంతగానో అభినందించారు.
ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్న ఈ కార్యక్రమం అమెరికా భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు, భారత దౌత్య కార్యాలయం కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ నేతృత్వంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రలో నిర్వహించగా, భారత దౌత్యకార్యాలయం నుంచి రాజేష్ నాయక్ మరియు డాక్టర్ అకున్ సభర్వాల్ సమన్వయపరిచారు.
సిలికాన్ ఆంధ్ర చైర్మన్ ఆనంద్ కూచిభొట్ల, దిలీప్ కొండపర్తి, రాజు చేమర్తి, డాక్టర్ హనిమి రెడ్డి, డాక్టర్ రమేష్ జొప్రా, సుబ్బా యంత్ర మరియు పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.