టాలీవుడ్ యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ.. గత ఏడాది ‘స్పై’ చిత్రంతో పలకరించాడు. తర్వాత ‘స్వయంభు’ సినిమా ప్రిపరేషన్లో బిజీగా ఉన్నట్లు కనిపించాడు. ఈ ఏడాది కొన్ని నెలల కిందట ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. అందులోనే నిఖిల్ తలమునకలైనట్లు కనిపించాడు. కానీ అతను ‘ది ఇండియా హౌస్’ అనే మరో సినిమాను కూడా లైన్టో పెట్టాడు కానీ.. అదింకా సెట్స్ మీదికి వెళ్లినట్లు కనిపించడం లేదు.
ఐతే ఈలోపు అతను ఓ సడెన్ సర్పైజ్ ఇచ్చాడు. తనకు ‘స్వామి రారా’ లాంటి కెరీర్ మలుపు తిప్పే సినిమాను అందించిన సుధీర్ వర్మతో సైలెంటుగా సినిమాను పూర్తి చేసేసి ఫస్ట్ లుక్ వదిలాడు. ఈ మూవీ పేరు.. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. ‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో మంచి పేరు సంపాదించిన కన్నడ అమ్మాయి రుక్మిణి వసంత్ ఈ చిత్రంతోనే తెలుగులోకి అడుగు పెడుతోంది.
ఈ రోజే లాంచ్ చేసిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ప్లెజెంట్‌గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ టైటిల్, ఫస్ట్ లుక్ చూస్తుంటే ఇదో ప్లెజెంట్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది. కేవలం ఫస్ట్ లుక్‌తో సరిపెట్టకుండా నేరుగా రిలీజ్ కూడా అనౌన్స్ చేసేసింది టీం. దీపావళి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుందట. ఇంతకుముందు దీపావళికే వచ్చిన ‘కార్తికేయ’ నిఖిల్‌కు పెద్ద విజయాన్నందించింది. దీంతో సెంటిమెంటుగా భావించి ఈ చిత్రాన్ని కూడా అదే సీజన్లో రిలీజ్ చేస్తున్నట్లున్నారు.
దీపావళికి విశ్వక్సేన్ మూవీ ‘మెకానిక్ రాకీ’తో పాటు తమిళ అనువాద చిత్రం ‘అమరన్’ కూడా రిలీజవుతోంది. సుధీర్ వర్మ ‘స్వామి రారా’ తర్వాత సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు. నిఖిల్‌తోనే చేసిన ‘కేశవ’ అంచనాలను అందుకోలేకపోయింది. మిగతా చిత్రాలన్నీ డిజాస్టర్లు అయ్యాయి. తనకు ఇప్పుడు సక్సెస్ చాలా అవసరం. నిఖిల్ కూడా ‘స్పై’ తర్వాత మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి ఈ జోడీకి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మంచి విజయాన్నందిస్తుందేమో చూడాలి.