పదికి పది వికెట్లు.. ఈ మాట ఎవరైనా ఎత్తితే ముందుగా అనిల్ కుంబ్లే గుర్తుకు వస్తాడు. టెస్టు క్రికెట్లో ఈ ఘనత సాధించింది ఇద్దరే. అందులో మన కుంబ్లే ఒకడు. క్రికెట్ గురించి పెద్దగా ప్రపంచానికి తెలియని రోజుల్లో.. ఈ ఆటకు ఆదరణ అంతంతమాత్రంగా ఉన్న సమయంలో.. 1956లో తొలిసారి ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లేకర్ ఒక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్ల ఘనత సాధించాడు. అతను ఆస్ట్రేలియాపై ఈ రికార్డు నమోదు చేశాడు.
43 ఏళ్ల తర్వాత 1999లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో అనిల్ కుంబ్లే.. పాకిస్థాన్‌తో టెస్టు మ్యాచ్‌లో ఈ ఘనతను పునరావృతం చేసి చరిత్ర సృష్టించాడు. మళ్లీ ఇంకెవ్వరూ టెస్టుల్లో ఈ అసాధారణ ఘనతను అందుకోలేదు. కాగా ఇప్పుడు న్యూజిలాండ్ స్పిన్ బౌలర్ అజాజ్ పటేల్ ఈ రికార్డును అందుకున్నాడు. అది కూడా ఇండియా మీద కావడం విశేషం.
ముంబయిలోని వాంఖడె స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో అజాజ్ పదికి పది వికెట్ల ఘనత సాధించాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో పడ్డ పది వికెట్లూ అతడి ఖాతాలోనే చేరాయి. తొలి రోజు ఆటలో భారత్ 4 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ఆ నాలుగు వికెట్లను అజాజే పడగొట్టగా.. రెండో రోజు, శనివారం ఆటలో పడ్డ ఆరు వికెట్లు కూడా అతడి ఖాతాలోకే వెళ్లాయి. భారత్ ఇన్నింగ్స్‌లో మొత్తం 109.5 ఓవర్లు పడగా.. అజాజ్ ఒక్కడే 47.5 ఓవర్లు వేయడం విశేషం. 12 మెయిడెన్లు విసిరిన అజాజ్.. 119 పరుగులిచ్చి పది వికెట్లను పడగొట్టాడు. భారత్ 325 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బ్యాట్స్‌మెన్‌లో మయాంక్ అగర్వాల్ (150; 311 బంతుల్లో 17×4, 4×6), అక్షర్ పటేల్ (52; 128 బంతుల్లో 5×4, 1×6) రాణించారు.
అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ 62 పరుగులకే కుప్పకూలిపోయింది. కివీస్ టాప్ ఆర్డర్ ను 3 వికెట్లతో హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ సిరాజ్ దెబ్బతీశాడు. ఆ తర్వాత స్పిన్నర్లు చెలరేగడంతో కివీస్ ఏ దశలోనూ కోలకోలేకపోయింది. అశ్విన్ 8 ఓవర్లలో 8 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి పర్యాటక జట్టు పతనాన్ని శాసించాడు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జయంత్ యాదవ్ 1 వికెట్ తీసి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఫాలో ఆన్ గండం ఎదుర్కొంటోన్న కివీస్ ను కోహ్లీ ఫీల్డింగ్ కు ఆహ్వానించాడు. ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ మొదలుబెట్టింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 263 పరుగుల ఆధిక్యం లభించింది.