వైసీపీ కొత్త మంత్రులకు అప్పుడే తలనొప్పులు మొదలయ్యాయి. వారిపై వస్తున్న ఆరోపణలతో సీఎం జగన్‌కూ నెత్తి నొప్పులు మొదలవుతున్నాయి.
నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అప్పుడే చోరీ ఆరోపణలు ఎదుర్కొంటుండగా మరో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు భక్తుల నుంచి నిరసన ఎదురైంది.
పదవులు చేపట్టి వారం రోజులైనా కాకముందే ప్రజల్లో చులకన అవుతుండడంతో మంత్రులపై విమర్శలు మొదలయ్యాయి.
ఓ కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డికి సంబంధించిన కీలక పత్రాలు, ల్యాప్ టాప్ నెల్లూరు కోర్టు నుంచి చోరీకి గురయ్యాయి.
నెల్లూరు కోర్టు కాంప్లెక్స్‌లోని 4వ అదనపు జ్యుడిసియల్ మేజిస్ట్రేట్ కోర్టులో బుధవారం అర్ధరాత్రి కొందరు చొరబడి కాకాని కేసుకు సంబంధించిన పత్రాలు, స్టాంపులు, ల్యాప్ టాప్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్న సంచిని ఎత్తుకెళ్లారు.
దీనిపై బెంచ్ క్లర్క్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ సంతకాలకు సంబంధించిన వ్యవహారంలో కాకాని, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మధ్య ఈ కేసు నడుస్తోంది.
దీనికి సంబంధించిన కీలక ఆదారాలు కోర్టు నుంచి ఎత్తుకెళ్లడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీకాళహస్తిలో దేవాదాయ శాఖ కొత్త మంత్రి కొట్టు సత్యనారాయణకు భక్తుల నుంచి నిరసన ఎదురైంది.
వేలాది మంది భక్తులు గంటల సమయం నిరీక్షిస్తుండగా వారందని గంటల పాటు ఆపేసి మంత్రిని దర్శనానికి తీసుకెళ్లారు అధికారులు. దీంతో భక్తులు ఆగ్రహించి మినిష్టర్ గోబ్యాక్ అంటూ తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు.
కొట్టు సత్యనారాయణకు తమ్ముడికి సంబంధించిన ఓ కంపెనీకి విశాఖలో అప్పనంగా తక్కువ రేటుకు భూములు కట్టబెట్టారని.. వేల కోట్ల రూపాయల ఆ వ్యవహారంలో క్విడ్ ప్రోకోగానే ఆయనకు మంత్రి పదవి లభించిందని ఇప్పటికే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.