నెల్లూరు రెడ్ల రాజకీయాలే వేరు. ఆనం రామనారాయణరెడ్డి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత. నెల్లూరు జిల్లాకు చెందిన రెడ్డి రాజ్యంలో కీలక నేతగా ఆయన ఎదిగారు. ఆనం సోదరులు వివేకానందరెడ్డి, రామనారాయణరెడ్డిలలో చిన్నవాడైన రామనారాయణరెడ్డి ఆలోచనాపరుడిగా.. వ్యూహకర్తగా.. సాత్విక నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. సమస్యలపై తనదైన ఆలోచన , విశ్లేషణ చేయగల నేర్పరిగా కూడా ప్రజల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది.
అయితే.. రాజకీయాల్లో ఆయన సమయానికి తగు మాటలాడినట్టుగా.. అడుగులు వేస్తున్నారు. 1983లో అన్నగారు ఎన్టీఆర్ పిలుపు మేరకు.. ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో రాపూరు(అప్పటి) నియోజకవర్గం నుంచి తొలిసారి టీడీపీ టికెట్‌పై విజయం దక్కించుకున్నారు. అయితే.. జిల్లాలో టీడీపీ నేతలకు ఆయనకు.. మధ్య పొసగక పోవడంతో ఆయన కుటుంబం కాంగ్రెస్‌లోకి వచ్చింది. తర్వాత.. క్రమంలో ఏర్పడిన వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి ఆయన వరుస విజయాలు దక్కించుకున్నారు.
ఈ క్రమంలోనే కిరణ్, రోశయ్యల కేబినెట్లో ఉమ్మడి ఏపీలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. చాలా ముందు చూపుతో వ్యవహరించిన ఆర్థిక మంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. సంక్షేమ పథకాలతోపాటు ప్రజలను ఆర్థికంగా పుంజుకునేలా చేసేందుకు.. వారికి ఉపాధి కల్పించాలన్న.. వ్యూహాలను అమలు చేసిన అతి తక్కువ మంది ఆర్థిక మంత్రుల్లో ఆనం ఒకరు. అయితే.. 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌కు దూరమై.. టీడీపీకి చేరువయ్యారు.
అప్పట్లో ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే.. టీడీపీ నుంచి ఆ అవకాశం లేకపోవడం, 2019 ఎన్నికల్లో ఆయన కోరుకున్న ఆత్మకూరు కూడా దక్కే అవకాశం కనిపించకపోవడంతో అనూహ్యంగా వైసీపీకి మద్దతుగా మారిపోయారు. ఆ ఎన్నికల్లోనూ ఆత్మకూరు దక్కలేదు. అయినా.. వెంకటగిరి నుంచి పోటీ చేసి… విజయం దక్కించుకున్నారు. ఇక, ఇప్పుడు వైసీపీకి కూడా ఆయన దూరమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున పోటీకి రెడీ అవుతున్నారు.
ఆయనకు ఎంతో కలిసి వచ్చిందని భావిస్తున్న ఆత్మకూరు నుంచి పోటీ చేయనున్నారని.. ఆనం వర్గం చెబుతోంది. ఈ టికెట్‌ను ఇచ్చేందుకు టీడీపీ కూడా రెడీ అయింది. దీంతో 1983 తర్వాత మళ్లీ టీడీపీలో టికెట్ దక్కించుకుని పోటీ చేస్తున్న రికార్డును ఆయన సొంతం చేసుకోనున్నారు. ఆత్మకూరులో తరచుగా ఆయన సమావేశాలు నిర్వహిస్తూ.. ఇక్కడ సమస్యలపైనా దృష్టి పెడుతున్నారు. 2024లో విజయం దక్కించుకునేలా ఆయన వ్యూహరచన కూడా రెడీ చేసుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.