1958 జూన్ 20న పుట్టిన ద్రౌపది ముర్మూ.. ఒడిశాలోని యమూర్ భంజ్ జిల్లా బైదపొసి ప్రాంతంలో జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరించి నారాయణ్ తుడు కాగా.. ఆమె భర్త శ్యామ్ చరణ్ ముర్మూ గతంలోనే మరణించారు. ఆమెకు ఇద్దరు కుమారులు.. ఒక కుమార్తె కాగా.. వారిలో ఇద్దరు కుమారులు గతంలోనే మరణించారు. కుమార్తె పేరు ఇతిశ్రీ ముర్మూ. భువనేశ్వర్ లోని రమాదేవి మహిళా కళాశాలలో బీఏ చదివిన ఆమె.. 1979-1983లో ఇరిగేషన్ డిపార్టు మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేశారు. అనంతరం గౌరవ అసిస్టెంట్ టీచర్ గా.. శ్రీ అరబిందో ఇంటెగ్రెల్ ఎడ్యుకేషన్ సెంటర్ లోనూ పని చేశారు.
ఇక.. ఆమె రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే.. ఉద్యోగ జీవనాన్ని పక్కన పెట్టేసిన 1997లోనే బీజేపీలో చేరి.. రాయ్ రంగ్ పూర్ కౌన్సిలర్ గా అనంతరం వైస్ ఛైర్మన్ గా పదవుల్ని చేపట్టారు. 2000లో రాయ్ రంగ్ పుర్ ఎమ్మెల్యేగా గెలిచారు. బిజు జనతాదళ్ – బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఒడిశా రవాణా.. వాణిజ్య మంత్రిగా 2000-2002లో పని చేసిన ఆమె ఆ తర్వాత రాష్ట్ర పశు సంవర్థక శాఖా మంత్రిగా ఎన్నికయ్యారు. 2004లో జరిగి ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
2002 నుంచి 2009 వరకు మయూర్ భంజ్ జిల్లాకు బీజేపీ అధ్యక్షురాలిగా పని చేసిన ఆమె.. 2006-2009 వరకు ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలిగా పని చేశారు. అనంతరం 2010లో మయూర్ భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. 2013-15లో మయూర్ భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా పని చేసిన ఆమె.. 2015లో జార్ఖండ్ గవర్నర్ గా ఎంపికయ్యారు. కట్ చేస్తే.. తాజాగా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావటంతో తిరిగి వార్తల్లోకి వచ్చారు. చిన్నతనం నుంచి సంఘ్ తో అనుబంధం ఉన్న ఆమె గెలుపు నల్లేరు మీద నడకే అన్న మాట వినిపిస్తోంది.