ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆయా పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పలు ప్రీ పోల్ సర్వేలు, కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 17 ఎంపీ సీట్లు గెలవబోతోందని షా జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 400 స్థానాల్లో విజయం సాధించనుందని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలతోపాటు విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కూడా మెరుగైన ఫలితాలు సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఒడిశాలో 16-17, ఏపీలో 17, పశ్చిమ బెంగాల్లో 24 నుంచి 32 స్థానాలు కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారం చేపట్టాక దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు చేస్తామని చెప్పారు.
కాంగ్రెస్ తెస్తామని చెబుతున్న ఏకీకృత వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)పై షా విమర్శలు గుప్పించారు. సంపన్నులు వాడే విలాస వస్తువులు, పేదలు వాడే సరుకులపై ఒకే పన్ను తెస్తామన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. రాహుల్‌గాంధీ వైఫల్యాన్ని కప్పి పుచ్చేందుకే పోలింగ్ విధానాన్ని కాంగ్రెస్ ప్రశ్నిస్తోందని ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదులు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం మోదీ ప్రభుత్వం సాధించిన విజయమన్నారు. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సమయం వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో వేసవిలో కాకుండా మరో సమయంలో ఎన్నికలు నిర్వహించడంపై దృష్టిసారిస్తున్నామన్నారు.