వైసీపీ నాయకులు ఒకరికొకరు చెప్పుకొని మరీ నవ్వుకుంటున్నారంటే.. విషయం అంత `తెలివి`గా ఉందన్న మాట! ఏదో ఒకరకంగా మీడియాలో ఉండాలి. ఏదో ఒక రకంగా నాయకుడిని మెప్పించాలి. జేజేలు కొట్టాలి.. కొట్టించుకోవాలి! ఈ యావ తప్ప.. కొందరు వైసీపీ నాయకులకు మరో యావ లేకుండా పోయింది. పైగా ఎన్నికల కాలం కావడంతో ఈ యావ మరింత పెరిగింది. దీంతో చిన్న చిన్న తప్పులతో అడ్డంగా దొరికి పోతున్నారు.
తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ..(ఇస్రో) చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టింది. ఇది మొత్తం 40 రోజులు సాగే యాత్ర. తొలి దశలో భూ కక్ష్యలోకి దీనిని ప్రవేశ పెట్టారు. ఇది సక్సెస్ అయింది. అయితే… ఎంతైనా మనోళ్లు సాధించిన ఘన విజయం కావడంతో దేశం నలుమూలల నుంచి కూడా అభినందనలు పోటెత్తాయి. ప్రధాని నుంచి అందరూ ఈ పరంపరలో ఉన్నారు.
అయితే.. ఇదే విషయాన్ని రాజకీయ వస్తువుగా వాడాలని అనుకున్నారో ఏమో.. చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన వైసీపీ నాయకుడు.. అత్యుత్సాహానికి పోయాడు. “నాస చంద్రయాన్-3` ప్రయోగం విజయ వంతం అయినందుకు శాస్త్రవేత్తలకు అవే నా అభినందనలు అని పేర్కొంటూ.. ఊరంత ఫ్లెక్సీలు వేయించి.. నగరం మొత్తం పరిచేయించారు. అయితే.. దీనిపై సొంత పార్టీ నాయకులే కితకితలు పోతున్నారు.
ఎందుకంటే.. ఈ ప్రయోగం చేపట్టింది భారత్. అంటే ఇస్రో. కానీ, వైసీపీ నాయకుడు మాత్రం నాస అని పేర్కొన్నాడు. ఇది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ. దీంతో ఆయన గారి తెలివి తేటలకు సొంత పార్టీ నాయకులే కిసుక్కున నవ్వుతున్నారు. అంతేకాదు.. `శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు` అని రాసిన పోస్టర్లో ఎక్కడా ఒక్క శాస్త్రవేత్త కూడా కనిపించకపోగా.. వారి స్తానంలో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి చిత్రాలను భారీగా ముద్రించారు. సో.. ఈయన దృష్టిలో వారే శాస్త్రవేత్తలా? అని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఇదీ.. వైసీపీ నేతల తెలివి! అని పగలబడి నవ్వుతున్నారు.