ఏపీ ప్రజలకు టీడీపీ నాయకుడు, మంత్రి నారా లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు.
‘ఎన్నారై టీడీపీ’ పేరుతో తన పేరు చెప్పి.. కొందరు మోసాలకు పాల్పడుతున్నారని.. వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తన పేరును, తన ఫొటోలను వాడుకున్న కొందరు.. ఎన్నారై టీడీపీ పేరుతో ఉన్న నకిలీ ఐడీలతో మోసాలకు తెగబడుతున్నట్టు నారా లోకేష్ పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఆర్థికంగా కూడా మోసాలకు తెరదీస్తున్నారని చెప్పారు.
‘నా పేరు, నా ఫోటో వాడుకుని ఎన్నారై టీడీపీ అనే ఫేక్ ఐడీతో మోసాలు చేస్తున్న మోసగాళ్లు మీకు ఈ క్రింది నెంబర్ల నుంచి మెసేజ్ చేస్తే వారిని బ్లాక్ చేయండి“ అని నారా లోకేష్ పేర్కొన్నారు.
నిజానికి ఎన్నారై టీడీపీ సభ్యులు, సోషల్ మీడియా విభాగం సభ్యులు ప్రజల సమస్యలు పరిష్కరించే పనిలో ఉన్నారని చెప్పారు.
ఇదే సమయంలో దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న కొందరు కేటు గాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్టు వివరించారు.
“మోసగాళ్లు కొందరు.. నా వద్దకు సాయం కోరి వచ్చే వారి డేటా దొంగిలిస్తున్నట్టు నాకు తెలిసింది.
అనంతరం నకిలీ ఐడీలు సృష్టించి.. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు.
వీరిపై ఇప్పటికే మా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే.. ప్రజలు కూడా ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహ రించాలి“ అని నారా లోకేష్ సూచించారు.
మా సిబ్బంది చేసేది ఇదీ..
టీడీపీ ఎన్నారై విభాగం సభ్యులు.. @OfficeofNL నుంచి మాత్రమే సేవలు అందిస్తారని నారా లోకేష్ తెలిపారు. దీని నుంచే బాధితుల సమాచారం అడిగి, వారికి కావాల్సిన సహాయం అందిస్తారన్నారు.
ఇతరత్రా ఏ నెంబర్ నుంచి ఫోన్ వచ్చినా, మెసేజ్ వచ్చినా, ఫోన్ పే చేయాలని కోరినా, వేరే విధంగా డబ్బు పంపాలని కోరినా అది మోసగాళ్ల పనేనని గుర్తించాలని సూచించారు.
ఇలాంటివి వస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.