టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆదోని నియోజకవర్గంలో 78వ రోజు పాదయాత్రను లోకేష్ కొనసాగించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా లోకేష్ కదం తొక్కుతూ ముందుకు సాగారు. ఈ క్రమంలోనే లోకేష్ కు కనివిని ఎరుగని రీతిలో కార్యకర్తలు, అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది.
లోకేష్ పాదయాత్ర సందర్భంగా ప్రజలు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. దివ్యాంగుడు దూదేకుల ఇస్మాయిల్ తన మూడు ఎకరాల పొలాన్ని 30 ఎకరాలు ఉందని చూపిస్తూ పెన్షన్ తీసివేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఇక, గ్రామంలో సాగు, తాగునీటి సమస్యల గురించి ప్రజలు, స్థానికులు….లోకేష్ కు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే క్యాష్ ప్రసాద్ అవినీతిపై లోకేష్ స్పందించారు.
తాను ప్రసాద్ అవినీతి చిట్టా విప్పుతుంటే ఆయన బూతుల పంచాంగం వినిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎర్రగట్టు కొండను తవ్విన ప్రకాష్ అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని చురకలంటించారు. ఇక, వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అర్ధనగ్న ప్రదర్శనపై కూడా లోకేష్ సెటైర్లు వేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు షర్టు ప్యాంటు విప్పి అంగాంగ ప్రదర్శన చేస్తున్నారని లోకేష్ పంచ్ వేశారు. దళితులకు జగన్ పీకింది, పొడిచింది ఏమిటి అని తాను అంటే ఫేక్ వీడియో తయారు చేసి దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.
ఆ వీడియో పట్టుకుని ఆదిమూలపు సురేష్ షర్టు విప్పి చంద్రబాబు గారి కాన్వాయ్ పై రాళ్లు వేశారని ఆరోపించారు. అక్కడున్నది చంద్రబాబు కాబట్టి సరిపోయిందని, తానుంటే సరైన ఫిట్టింగ్ ఉండేదని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఆదిమూలం గారికి దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే దళితులపై దమనకాండ చేస్తున్న జగన్ ను ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. డాక్టర్ సుధాకర్ మొదలు డాక్టర్ అచ్చెన్న వరకు ఎంతోమంది వైసీపీ పాలనలో బలయ్యారని, అప్పుడు సురేష్ ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు.