వైసీపీ అధినేత జగన్ శనివారం రాత్రి చేసిన విమర్శలకు టీడీపీ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అదిరిపోయే ట్వీట్‌తో రిప్లయ్ ఇచ్చారు. ఇదేసమయంలో విపక్షం తీరును ఎండగడుతూ.. భారీ షాక్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్న మీకు ఆ హుందాతనం ఉందా జగన్? అని నారా లోకేష్ ప్రశ్నించారు. బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారి అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. అని దుయ్యబట్టారు.
“పాస్ పోర్ట్ సమస్య లేకపోతే ఎప్పుడో లండన్ ఎగిరిపోవాల్సిన మీరు. బెంగుళూరు ప్యాలస్ లో రిలాక్స్ అవుతూ 74 ఏళ్ల వయస్సు లో క్షణం తీరిక లేకుండా వరద బాధితులకు సాయం అందిస్తున్న చంద్రబాబుపై విమర్శలు చెయ్యడానికి మనసు ఎలా వచ్చింది“ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వరద నీటిలో నడుస్తూ.. పరిస్థితులను సమీక్షిస్తున్న దృశ్యాలను ఆయన పోస్టు చేశారు.
విపత్తులు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ అందజేసిన చరిత్ర మీకు లేదని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. “పైగా మీరు ప్రకటించే సెల్ఫ్ చెక్స్ కథ అందరికీ తెలిసిందే! నాడు చంద్రబాబు.. బుడమేరు ఆధునీకరణకు రూ.464 కోట్లు కేటాయించి పనులు ప్రారంభిస్తే మీ రివర్స్ పాలనలో పనులు నిలిపి విపత్తుకు ప్రధాన కారణం అయ్యారు“ అని దుయ్యబట్టారు.
“బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం జగన్.. ఇది జగన్ మేడ్ డిజాస్టర్. ఆధునీకరణ, మరమ్మత్తుల పనులు ఆపేసారు. సుమారుగా రూ.500 కోట్లు విలువైన 600 ఎకరాలు వైసిపి నాయకులు కబ్జా చేశారు. 2022 లోనే గండి పడినా పట్టించుకోలేదు. 5 ఏళ్ళలో సరైన నిర్వహణ లేదు. విజయవాడ నగరంలో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులు ఆపేశారు. మీ పాలన వైఫల్యాలే నేడు ప్రజల కష్టాలు. అన్ని సమస్యలను అధిగమిస్తాం. చివరి వరద బాధితుడికి సాయం అందించే వరకూ విశ్రమించం.“అని నారా లోకేష్ పేర్కొన్నారు.