ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నారా లోకేష్ చేత మంత్రి పదవికి రాజీనామా చేయించే ఛాన్స్ దక్కింది. ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఛాన్స్ ఇచ్చింది కూడా లోకేషే. విశాఖపట్నంలో భూములను ఉర్సా కంపెనీకి ఎకరం రూపాయికే కట్టబెట్టారంటూ జగన్ గతంలో కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలు నిరూపించాలంటూ తాజాగా మరోసారి జగన్‌కు ఛాలెంజ్ చేశారు నారా లోకేష్. జగన్ గారు చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఒకవేళ ఆరోపణలు తప్పని తెలితే రాష్ట్ర యువతకు జగన్ క్షమాపణ చెబితే చాలన్నారు.
ఇప్పటికే ఉర్సా సంస్థకు కేటాయించిన భూములపై లోకేష్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా మరోసారి లెక్కలతో సహా వివరాలు బయటపెట్టారు. ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటి పార్క్ హిల్ – 3 లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించామని.. కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున 56.36 ఎకరాలు ఇచ్చామని లోకేష్ తెలిపారు. ఆరోపణలు చేయడం, పారిపోవడం.. బురద జల్లి ప్యాలెస్ లో దాక్కోవడం కాదు.. చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ జగన్ కు లోకేష్ హితవు పలికారు.
ఐదేళ్ల విధ్వంస పాలనలో ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారని.. కానీ తమ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుందని.. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబడుతున్నామని లోకేష్ వివరించారు. అవి చూసి తట్టుకోలేకపోతే ఈనో వాడండి కాస్త రిలీఫ్ వస్తుందంటూ నారా లోకేష్ సలహా ఇచ్చారు. మరి లోకేష్ ఇచ్చిన ఛాలెంజ్ ను జగన్ యాక్సెప్ట్ చేస్తారా? ఛాన్స్ ను వాడుకుంటారా? అన్నది చూడాలి.