రాజకీయ నాయకులు తమకు అవకాశం వచ్చినప్పుడు ప్రత్యర్థి మీడియా సంస్థలపై పరువు నష్టం కేసులు వేస్తారు కానీ వాటిని సీరియస్‌గా కొనసాగించరు. కానీ మాజీ మంత్రి నారా లోకేశ్ మాత్రం అందుకు భిన్నంగా నిరూపిస్తున్నారు.
విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో తన అల్పాహారాల కోసం ప్రభుత్వం 75 లక్షలు వెచ్చించిందంటూ పరువు నష్టం కలిగించే కథనంపై ‘సాక్షి’కి లీగల్ నోటీసు పంపారు.
తాను చెప్పిన తేదీల్లో విశాఖపట్నంలో లేనని, సాక్షి ప్రోటోకాల్ ఖర్చులను తన ఖాతాలో వేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించిందని లోకేష్ ప్రస్తావించారు. లీగల్ నోటీసుకు సాక్షి బదులిచ్చినా ఆ సమాధానం లోకేష్‌ను సంతృప్తి పరచలేదు.
ఈ అంశంపై నారా లోకేష్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలోని 12వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టుకు లోకేష్ హాజరయ్యారు. ఉద్దేశ్యపూర్వకంగా తన పరువు తీసినందుకు మాజీ మంత్రి 75 కోట్లు పరిహారంగా డిమాండ్ చేస్తున్నాడు.
ఈ అంశాన్ని లోకేష్ సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, 2019కి ముందు సాక్షి ప్రచారాన్ని పట్టించుకోకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసు పెట్టడం గమనార్హం. టీడీపీ వైసీపీ అసత్య ప్రచారాన్ని పట్టించుకోకుండా వదిలేయడం వల్ల తీవ్రంగా నష్టపోయింది. ఇపుడు మేల్కొంది.
కోర్టుకు వచ్చిన సందర్భంగా లోకేష్ ఏం మాట్లాడారంటే…‘‘సాక్షి సహా మూడు మీడియా సంస్థలపై కేసు పెట్టాను. ‘దీ వీక్’ క్షమాపణలు కోరింది.. సాక్షి, దక్కన్ క్రానికల్ వివరణ కూడా ఇవ్వలేదు. వివేక హత్య తర్వాత చంద్రబాబుపై సాక్షి మీడియా దుష్ప్రచారం చేసింది.నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం సాక్షి మీడియా చేసింది. నేను వేటికి భయపడను.. తప్పుడు వార్తలు రాస్తే చట్టప్రకారం ముందుకు వెళ్తాను.నా తల్లిపై అసెంబ్లీ సాక్షిగా దారుణంగా మాట్లాడారు. విజయలక్ష్మి, భారతి, వారి పిల్లల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. కానీ మా సంస్కృతి అది కాదు.. ఓ తల్లి ఎలా బాధపడుతుందో కొడుకుగా చూశా. నా తల్లిని కించపర్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను
– నారా లోకేష్